సాక్షి, తిరుపతి : సొంత జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే దుస్సంకల్పంతో సభ్య సమాజం సిగ్గుపడే అక్రమాలకు సైతం తెరలేపేందుకు వెనుకాడడం లేదు. నోట్లతో ఓట్లను కొని అందలమెక్కాలనే ఆరాటంలో ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. చిత్తూరు పార్టీ కార్యాలయం వేదికగానే చంద్రబాబు ఓటర్ల కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. జిల్లా పార్టీ కార్యాలయంలోనే సోమవారం రాత్రి బసచేసి, వేకువ జామునే అభ్యర్థులతో సమావేశమయ్యారు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడారు. అనంతరం మదనపల్లి, తంబళ్లపల్లి, నగరి, సత్యవేడు అభ్యర్థులను పిలిపించుకుని దిశానిర్ధేశం చేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం రూ.30 కోట్లు తగ్గకుండా ఖర్చు పెట్టాలని చంద్రబాబు అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా ఆయా నియోజకవర్గాల్లోని మండలాల బాధ్యతలను టీడీపీలోని ముఖ్య నాయకులకు అప్పగించారు. ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, డ్వాక్రా మహిళలు, మెఫ్మా, ఆర్‌పీ, సేవా మిత్రలను వాడుకోమని చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. కాంట్రాక్టు పనులు చేసిన వారి నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేసుకోమని తేల్చిచెప్పారు. పోలీసులు, ఇంటెలిజెన్స్, ఎస్‌బీఐ అధికారులనువినియోగించుకోమని, అందుకు కొంతమంది పేర్లు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్సార్‌సీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను టార్గెట్ చెయ్యమని ఆదేశించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఈ ఎన్నికల్లో అమలు చెయ్యాలని సూచించారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడంతో పాటు మద్యం, బహుమతులు ఇవ్వాలని చెప్పారు. అదే విధంగా ఓటు బ్యాంక్ ఉన్న తటస్తులను గుర్తించి వారికి కార్లు, ట్రాక్టర్లు మరేదైనా కావాలన్నా కొనుగోలు చేసి బహుమతులుగా ఇవ్వాలని అభ్యర్థులకు చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment