
స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న తెలుగు తమ్ముళ్లు
తాడిపత్రి తెలుగుదేశంపార్టీలో ముసలం ప్రారంభమైంది. పార్టీలోని సీనియర్లు తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కారు. ఇటీవల టీడీపీలో చేరిన నాయకుల మాట విని సీనియర్లను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళనకు దిగారు.
తాడిపత్రి: టీడీప్టీలో ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన (పాత టీడీపీ) నాయకులు, ఇతర పార్టీల నుంచి వలసొచ్చిన (కొత్త) నాయకులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మంగళవారం రాత్రి టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ తమ్ముడు అయిన ‘అన్న ట్రాన్స్‌పోర్టు’ నిర్వాహకుడు శేఖర్‌పై జేసీ అనుచరులు దాడి చేసి, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని, లారీలను, ఇన్నోవా వాహనాన్ని ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. నిందితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయి.. కౌంటర్ ఫిర్యాదు ఇచ్చారు. బాధితుడు కాకర్ల శేఖర్‌ను రాత్రి నుంచి పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించారు.
బుదవారం ఏమి జరిగిందంటే..
విషయం తెలుసుకున్న టీడీపీ నేత, మంత్రి పరిటాల సునీత వర్గీయుడు అయిన కాకర్ల రంగనాథ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గుత్తావెంకటనాయుడు, వేలూరి శ్రీనివాసులనాయుడు, బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి,హీరాపురం ఫయాజ్‌బాషా తదితరులు తమ వర్గీయున్ని వదిలిపెట్టాలని అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పట్టణ సీఐ భాస్కర్‌రెడ్డి అప్పటికి స్టేషన్‌కు రాలేదు. గంటల తరబడి వేచి చూసినా ఆయన రాకపోయే సరికి నాయకులు సహనం కోల్పోయి పోలీస్‌స్టేషన్ ఎదుటే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
బాధితుడినే నిర్బంధిస్తారా..?
టీడీపీ నాయకులు ఆందోళన చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పట్టణ, రూరల్ సీఐలు భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. బాధితుడైన కాకర్ల శేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించి, కేసు ఎలా పెడతారని సీనియర్ (పాత) టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ప్రశ్నించారు. పాతికేళ్లుగా పార్టీ జెండా మోసిన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వలస నేతలు టీడీపీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారంటూ సీనియర్లు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ ఒకరి సొత్తేమీ కాదని, జెండా మోసే ప్రతి కార్యకర్తకూ సొంతమని హీరాపురం ఫయాజ్‌బాషా స్పష్టం చేశారు.
ఎట్టకేలకు శేఖర్ విడుదల
టీడీపీ సీనియర్లకు సీఐలు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం స్టేషన్‌లో చర్చలు జరిపారు. స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న కాకర్ల శేఖర్‌ను విడిచిపెట్టడంతో వారు శాంతించారు.
వారికి జెండా మోసే అర్హత లేదు
తాడిపత్రి: టీడీపీ జెండా మోసే అర్హత కాకర్ల రంగనాథ్‌కు, జగదీశ్వర్‌రెడ్డికి, ఫయాజ్‌బాషాకు లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ బీఎండీ. జిలాన్‌బాషా ధ్వజమెత్తారు. జేసీ అనుచరులైన వైస్ చైర్మన్‌తోపాటు తెలుగుయువత నాయకులు అయూబ్, కో ఆప్షన్ సభ్యుడు నియాజ్‌బాషా, సర్పంచ్ రమణ తదితరులు బుధవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పాత తెలుగుదేశం (సీనియర్లు) అని చెప్పుకుంటున్న నాయకులు ఈరోజు చేసిన నిర్వాహకం వల్ల పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహానికి మకిలి పట్టిందని, అందుకే క్షీరాభిషేకం చేశామని వివరించారు. వారి నోటి నుండి పాత తెలుగుదేశం పార్టీ కొత్త తెలుగుదేశంపార్టీ నాయకులని రావడం చాలా దారుణమన్నారు. మీ ఆగడాలను ప్రశ్నించినందుకే ఈరోజు జేసీ సోదరులను వీడి మీరు బయటికివచ్చారని, పార్టీని బజారుకీడుస్తే త్వరలోనే పట్టణాధ్యక్షుడి హోదాలో వారికి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని జిలాన్ బాషా హెచ్చరించారు.
నాతో రూ.5 కోట్లు ఎలా ఖర్చుపెట్టించారు?
తాడిపత్రి: తనకు టీడీపీలో సభ్యత్వం లేకుంటే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనతో రూ.5 కోట్లు ఎలా ఖర్చు పెట్టించారంటూ పరిటాల వర్గీయుడైన కాకర్ల రంగనాథ్ ప్రశ్నించారు. పార్టీ సభ్యతం శాసనసభ్యుడు అందజేయాలి కానీ, తాను జేసీ సోదరులకు ఎక్కడ పోటీ అవుతానోనని తనకు సభ్యత్వం ఇవ్వలేదని వివరించారు. ముళ్లపొదల్లో పేకాటాడే వ్యక్తులకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. తాడిపత్రిలో తెలుగుదేశంపార్టీకి చెందిన ఏ కార్యకర్తకైనా చిన్న కష్టం వస్తే వారికి తాను అండగా ఉంటానని కాకర్ల రంగనాథ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment