పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటుకు ‘పచ్చ’నోటు ఎర వేస్తున్నారు. చిత్తూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మోప్మా, వెలుగు సిబ్బంది ద్వారా ఓటర్లకు నగదు పంపిణీ చేయాలని భావించారు. ఇందుకోసం సంబంధిత సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పారు. కొందరు తమవల్ల కాదంటూ చేతులెత్తేయడంతో సంబంధిత అధికారుల ద్వారా ఫోన్లుచేసి వారిపై ఒత్తిడి తెప్పించారు.
సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: ఓటర్లకు డబ్బుల పంపిణీకి అధికార పార్టీ కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల తరహాలో కొందరు మెప్మా సిబ్బంది, సేవా మిత్రలను రంగంలోకి దింపింది. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌లతో పాటు శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు,మదనపల్లి మున్సిపాలిటీల పరిధిలో పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం (మెప్మా) ద్వారా కొందరు అధికారులకు, రిసోర్సు పర్సన్లకు, సేవా మిత్రలకు భారీగా నగదు ముట్టజెప్పారు. పట్టణాల్లో పంపకాలు జరిగితే తమకు చెడ్డపేరు వస్తుందని, నగదు పంపిణీని ఊరి శివారుల్లో పెట్టుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. అందులో భాగంగా చిత్తూరులోని ఓ డీఎస్పీ సలహా మేరకు టీడీపీ నేతలు కోడిగుట్టలో ఈ వ్యవహారాన్ని ముగించారు.
భయపెట్టి గుప్పెట్లో పెట్టుకున్న తమ్ముళ్లు
జిల్లా వ్యాప్తంగా మెప్మా వెలుగు గ్రూపుల్లోని సభ్యులను పర్యవేక్షించేందుకు సుమారు 450 మంది కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు, ఆర్‌పీ, ఎస్‌ఎల్‌ఎఫ్‌లు ఉన్నారు. వీరు కాకుండా గ్రూపు లీడర్లు ఉన్నారు. కార్పొరేషన్లు, పట్ట ణాల్లో టౌన్ మిషన్ మేనేజ్‌మెంట్ మేనేజర్, కమ్యూనిటీ ఆఫీసర్లు, తాత్కాలిక ఆర్పీలు, స్లమ్ లెవల్ ఫెడరేషన్ సభ్యులు, రీసోర్స్ పర్సన్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో మహిళల్ని ప్రభావితం చేయడానికి వీరిలో కొందర్ని అధికార పార్టీ నాయకులు భయపెట్టి వారి గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. వీళ్లు చెబితే మహిళలు వింటారని భ్రమించి తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌లతో పాటు మున్సిపాలిటీల్లో పనిచేసే ఒక్కో అధికారికి రూ.40 వేలు, కొందరు సీవోలకు రూ.20 వేలు, పదుల సంఖ్యలో ఆర్పీలు, ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు రూ.10 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
బయటపడిందిలా..
చిత్తూరు నగరంలో ఆర్పీలు తీసుకున్న రూ.10 వేలులో ఒక్కొక్కరూ రూ.500 చొప్పున పైఅధికారికి ఇవ్వాలని కొందరు సీవోలు ఒత్తిడి తీసుకొచ్చారు. ‘ఎలాగో ఉచితంగా వచ్చిన డబ్బే కదా.. రూ.500 ఇవ్వండి’ అంటూ వసూళ్లకు తెరతీశారు. ఇలా రూ.44 వేల వరకు వసూలు చేసి ఓ అధికారిణికి ఇచ్చారు. పలువురు ఆర్పీలు ఈ మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో చిత్తూరు నగరం కోడిగుట్టలో పంచాయితీ పెట్టారు. జిల్లావ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొందరు ఇదే తరహాలో వసూళ్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంలో రాష్ట్రస్థాయి మెప్మా అధికారి హస్తం ఉన్నట్లు చిత్తూరు మెప్మాలోని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లు వింటే ఆ అధికారికి ఐఏఎస్ హోదా కచ్చితంగా ఇస్తామని చెప్పడంతో మున్సిపాలిటీల్లో మహిళలకు నజరానాలు ఆశచూపి ప్రలోభాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
నంద్యాల తరహాలో..
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల తరహాలో టీడీపీ నేతలు నగదు పంపిణీకి మెప్మా, వెలుగు సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది తాము చేయలేమని చేతులెత్తేయడంతో అధికారుల ద్వారా ఫోన్లుచేసి బెదిరింపులకు దిగినట్లు ఓ అధికారిణి కన్నీరు పెట్టుకున్నారు. ఇష్టం లేకపోయినా టీడీపీ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినట్లు నడుకోకతప్పడం లేదని వెల్ల డించారు. టీడీపీ అభ్యర్థుల నుంచి తమకు నగదు చేరిందని, ఆ నగదును నేటి రాత్రిలోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. వీలైతే ఓటింగ్ ముందు రోజు రాత్రి మరో విడత కూడా పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉండాలని హుకుం జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయం కొందరు మెప్మా సిబ్బంది కుటుంబీకుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కోడ్‌ను ఉల్లంఘించి మెప్మా, వెలుగు సిబ్బందిని డబ్బుల పంపిణీకి వినియోగించుకుంటున్నారని వివరించారు. అయితే పోలీసు అధికారులు కేసు నమోదు చేయడానికి సమయం కావాలని చెప్పినట్లు మెప్మా సిబ్బంది కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కూడా కొందరు వెలుగు సిబ్బంది ద్వారా పంపిణీకి రంగం సిద్ధం చేశారు. వెలుగు సిబ్బందిలోని కొందరి నివాసాల్లో నగదు, మద్యం నిల్వ ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఈసీ స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment