అభివృద్ధి మంత్రంతో నెగ్గుకురాలేమని ఓ పక్క చంద్రబాబు వ్యూహాలు రచిస్తుంటే.. జిల్లా టీడీపీ నేతలు సిగపట్లతో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర కాలం ఉండగానే.. ఆ సీటు నాదంటే నాదంటూ కుమ్ములాటలు మొదలెట్టారు. కొన్నిచోట్ల ప్రస్తుత ప్రజాప్రతినిధులపైకి స్థానిక నాయకులు కాలు దువ్వుతుండగా.. మరికొన్నిచోట్ల జంప్ జిలానీలు ఆశావహులకు ఎసరు పెట్టేలా ఉన్నారు.
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యేలకు ఆశావహులు ఒకపక్క చెమటలు పట్టిస్తుంటే.. వైఎస్సార్‌సీపీ నుంచి వలస వచ్చిన శాసనసభ్యులు తొలి నుంచీ టీడీపీని నమ్ముకున్న నేతల ఆశలకు గండి కొడుతున్నారు. వెరసి ఎన్నికల వేడి రాజుకోకముందే అధికార పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. నేను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ప్రజాప్రతినిధులే కాదు.. ఆ పార్టీ నేతలు సైతం గురిపెట్టి బరిలోకి దిగుతుండడంతో సిటింగ్‌లకు ప్రాణ సంకటంగా మారింది.
ఈసారి సీటు దక్కుతుందో లేదోనన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పుణ్యమాని అరకు, పాడేరు స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ల ఆశలకు గండిపడే పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ఎన్నికల్లోనైనా గెలవకపోతానా? అని పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆశలు పెట్టుకోగా.. ఈసారి తనకు చాన్స్ దక్కుతుందన్న ఆశతో సీనియర్ నాయకుడు పాంగి రాజారావు ఇంతకాలం ఉన్నారు.
గతేడాది టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రాకతో వీరి ఆశలకు గండిపడినట్టయింది. అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని నమ్మించి మోసగించినా పార్టీనే అంటిపెట్టుకున్న మాజీ మంత్రి మణికుమారి, త్రిసభ్య కమిటీ సభ్యులైన బొర్రా నాగరాజు, ఎంవివిఎస్ ప్రసాద్‌లు రానున్న ఎన్నికల్లో పాడేరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.
కానీ అనూహ్యంగా టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాకతో వీరి ఆశలకు ఇక్కడ గండి పడింది. ఈ రెండు చోట్ల పైకి గుంభనంగా ఉన్నప్పటికీ లోలోన మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పార్టీ ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి చేరికను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బాహాటంగానే వ్యతిరేకించారు. గత నాలుగేళ్లుగా నామినేటెడ్ పదవులు దక్కక.. రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ఆశ లేక ఏజెన్సీ టీడీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిçప్పులా రాజుకుంటోంది. ఏ క్షణంలోనైనా వీరు తమ అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మైదానంలో అసమ్మతి సెగలు
మైదాన ప్రాంతంలోనూ ఇదే రీతిలో అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. అనకాపల్లితోపాటు యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకు పలువురు ఎసరుపెట్టేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి నియోజక వర్గంపై ఒకరు కాదు.. ఇద్దరు కాదు నెలకొకరు సీటు నాదంటే నాదంటూ తెరపైకి వస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూ కబ్జా కేసులో ఇరుక్కోవడంతో ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఈ స్థానం నుంచి పోటీ చేయబోతున్నామంటూ.. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు నర్మగర్భంగా ప్రకటించారు.
అబ్బే అదేం లేదు ఈసారి నేనే పోటీ చేస్తా, నా సీటు ఎవరికీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పీలా చెప్పుకొచ్చారు. తాజాగా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలికి టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన బంధువు పరుచూరి భాస్కరరావు తన మనసులోని మాటను బయటపెట్టారు. అనకాపల్లి నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని, పార్టీ అధిష్టానం కూడా తన సేవలను గుర్తించి టికెట్ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీంతో అనకాపల్లి అసెంబ్లీపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పోటీ పడుతున్నట్టయ్యింది.
యలమంచిలి నుంచి రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ స్థానంపై ఇరువురు కన్నేశారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు ఆడారి ఆనంద్‌తో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని భర్త లాలం భాస్కర్ ఈ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. విశాఖ డెయిరీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఆడారి తులసీరావు లేదా ఆయన కుమార్తె పాల్గొనేవారు. కానీ కొన్ని నెలలుగా ఆనంద్ చురుగ్గా పాల్గొంటున్నారు. భాస్కర్ కూడా ఈ నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో పంచకర్ల కొత్త నియోజకవర్గం వెతుక్కోవల్సిన పరిస్థితి నెలకొంది.
చోడవరంపై గంటా కన్ను
చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుకు ఈసారి ఎసరు పెట్టేలా ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజుకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతిసారి నియోజకవర్గం మారే గంటా ఈసారి సిటీలో ఏదో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వర్కవుట్ కాకపోతే గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన చోడవరాన్ని ఎంచుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఈ స్థానం నుంచి టీడీపీ తరపున తాను బరిలోకి దిగబోతున్నట్టు గంటా తనయుడు రవితేజ ఆమధ్య స్టేట్‌మెంట్ కూడా ఇచ్చిన విషయం విదితమే. ఈ తండ్రీ కొడుకులిద్దరూ చోడవరంలో ఎమ్మెల్యే రాజు సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏడాదిన్నర ముందుగానే అధికార టీడీపీలో నెలకొన్న సీట్ల సిగపట్లు ఆ పార్టీకి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment