..ఎక్కుదామా? కారెక్కుదామా? | TDP may play role with TRS in Telangana | Sakshi
Sakshi News home page

..ఎక్కుదామా? కారెక్కుదామా?

Published Sun, Oct 8 2017 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

TDP may play role with TRS in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలసి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోందా? అందులో భాగంగానే ఆ పార్టీ తెలంగాణ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు పొత్తు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారా? పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం మేరకే మోత్కుపల్లి ఈ ప్రకటన చేశారా? తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ పార్టీలలో ఇప్పుడీ అంశాలే హాట్‌ టాపిక్‌గా మారాయి. టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కోవడానికి వచ్చే ఎన్నికల నాటికి విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌తో టీడీపీ పొత్తు ప్రతిపాదన రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

అసలు విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చెబుతున్న తరుణంలోనే.. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై మోత్కుపల్లి బాంబు పేల్చారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహం మేరకే మోత్కుపల్లి ఈ ప్రకటన చేసి ఉంటారని టీటీడీపీ సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో విపక్షాల ఐక్యతను దెబ్బకొట్టేందుకు టీడీపీని బయటకు లాగాలన్న టీఆర్‌ఎస్‌ కీలక నేతల ప్రయత్నం కూడా దీనికి కారణమని చెబుతున్నారు.

రేవంత్‌ మాటలు పట్టించుకోవద్దు?
రేవంత్‌రెడ్డి ఎంత ఘాటుగా మాట్లాడినా.. టీఆర్‌ఎస్‌ను ఎంతగా దూషించినా చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే అంతిమమని టీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరమని భావిస్తున్న టీటీడీపీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. అందువల్ల రేవంత్‌ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి పెళ్లికి వెళ్లిన సీఎం కేసీఆర్‌.. అక్కడ అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌తో రహస్య మంతనాలు ఎందుకు జరపాల్సి వచ్చిందని రేవంత్‌ బహిరంగంగా విమర్శించారు. కానీ ఈ మొత్తం తతంగం వెనుక ఇరు పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని మోత్కుపల్లి, ఎల్‌.రమణ సహా కొందరు సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలహీనమైనందున టీఆర్‌ఎస్‌తో పొత్తు ద్వారా కొన్ని సీట్లయినా గెలవొచ్చని సీనియర్లు పార్టీ అధినేత చంద్రబాబుకు కొంతకాలంగా చెబుతూ వస్తున్నట్లు సమాచారం.

రెండు రకాల ముచ్చట్లు..!
తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని ఇటీవల విజయవాడలో రేవంత్‌రెడ్డికి చెప్పిన చంద్రబాబు.. తర్వాత రెండు రోజులకే ఇద్దరు ముగ్గురు సీనియర్లను పిలిపించుకుని పొత్తు ఉంటే ఎలా ఉంటుందని అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు ఉన్నాయని.. అందువల్ల ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని 15–20 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను తీసుకోవడం ద్వారా పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చని సీనియర్లు పేర్కొన్నట్లు తెలిసింది. ముందుగా ఈ ప్రతిపాదన టీఆర్‌ఎస్‌ నుంచే వచ్చిందని చంద్రబాబు ఆ నేతలకు వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ చర్చ సమయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని దూరంగా పెట్టారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు రేవంత్‌కు ఇష్టం ఉండదని కావాలనే ఆయనను దూరం పెట్టారని అంటున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా టీఆర్‌ఎస్‌ పొత్తు ప్రతిపాదన వచ్చిన సమావేశంలో ఉన్నారు. పొత్తు విషయంలో తన వైఖరి చెప్పని ఆ మాజీ ఎమ్మెల్యే.. హైదరాబాద్‌ తిరిగొచ్చాక ఈ విషయాన్ని రేవంత్‌కు చెప్పినట్లు సమాచారం. దాంతో టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పారని.. అందువల్ల ఆ ప్రతిపాదన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్‌ పేర్కొన్నట్లు తెలిసింది. ఇలా పొత్తు ఉండదని ఒకరితో, పొత్తు ఉంటే ఎలా ఉంటుందని మరికొందరితో చంద్రబాబు చెబుతుండడంతో టీటీడీపీ వర్గాలు అయోమయంలో పడిపోయాయి.

మా దారి మేం చూసుకుంటాం?
టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రతిపాదన ఉంటే ఎన్నికలకు ముందే తమ దారి తాము చూసుకుంటామని రేవంత్‌రెడ్డి, ఆయనను అనుసరిస్తున్న ఇతర నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని ఆరాటపడుతున్న జూనియర్‌ నేతలంతా రేవంత్‌తో కలసి గ్రూపుగా ఏర్పడ్డారు. వీరితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, పలువురు జూనియర్లు పొత్తు ఉండకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే 10 స్థానాలకు మించి ఇవ్వకపోవచ్చని.. అదే జరిగితే టీడీపీలో ఉండి ప్రయోజనమేమిటన్నది వారి వాదన. ‘నాకు తెలిసి టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు. కొద్దిమంది టీడీపీ రాజకీయ నిరుద్యోగులు మాత్రం ఐదారు సీట్లు అయినా సాధించుకుని పొత్తులో భాగంగా పోటీచేసి గెలవాలని భావిస్తున్నారు..’అని మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి ‘పొత్తు’వ్యాఖ్యల నేపథ్యంలో.. పార్టీ అధినేత చంద్రబాబును కలసి విషయం తేల్చుకోవాలని పొత్తు ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న వారు భావిస్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement