ఏలూరు పర్యటన సందర్భంగా పవన్‌తో బడేటి బుజ్జి భేటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి జనసేన వైపు చూస్తున్నారా? ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బడేటి బుజ్జి జరిపిన ఏకాంత భేటీ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య ఇంటికి గురువారం రాత్రి పవన్ కల్యాణ్ వచ్చిన సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను మాత్రమే కలవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాఘవయ్య తల్లిని పరామర్శించిన సందర్భంలోనే పవన్ కల్యాణ్ ఇటీవలే వివాహమైన బడేటి బుజ్జి కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించారు. బుజ్జి అల్లుడికి రాఘవయ్య దగ్గర చుట్టం కావడంతో పెళ్లికి పవన్ కల్యాణ్ రావాల్సి ఉందని, కుదరకపోవడంతో గురువారం ఆశీస్సులు అందించారని చెబుతున్నారు. ఈ సందర్భంగా పవన్‌తో బుజ్జి ఏకాంతంగా భేటీ అయ్యారు.
అల్లుడి కోసమా?
అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఎమ్మెల్యే బడేటి బుజ్జికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సీటు ఇచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. బుజ్జి గెలిచిన తర్వాత ఏలూరులో చోటు చేసుకున్న రౌడీ రాజకీయాలు, హత్యలు, భూకబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఈసారి కొత్తవ్యక్తికి అవకాశం ఇస్తారని తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీటు రాని పక్షంలో జనసేన నుంచి తానుగానీ తన అల్లుడుగానీ నిలబడాలని బుజ్జి భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే అల్లుడిని ప్రజల ముందుకు తీసుకువచ్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇటీవల ఎయిడ్స్ బాధిత పిల్లల సహాయార్థం అంటూ రోటరీ క్లబ్ తరపున నిర్వహించిన 5కే రన్ కోసం నగరంలో విస్త్రత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో క్లబ్ అధ్యక్షుని హోదాలో ఎమ్మెల్యే అల్లుడికి విపరీతమైన ప్రచారం కల్పించారు. బాధితులకు ఎంత సహాయం చేసారో ఇంకా బయటకు రాలేదు గానీ అంతకు మించి ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ ప్రచారం కూడా ఒక పథకం ప్రకారం చేశారని తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి. అవసరమైతే జనసేన తరఫున తన అల్లుడిని అభ్యర్థిగా ఫోకస్ చేసే యత్నం జరుగుతున్నట్టు సమాచారం.
టీడీపీ నేతలను పవన్ కలవడంపై అనుమానం
ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినందున ఏలూరులోని జనసేన నాయకులు, అభిమానులను కలవడం లేదని పవన్ చెప్పినా, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను మాత్రం కలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చెప్పిందే పవన్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నగరానికి వచ్చిన తమ నేత కేవలం ఆ పార్టీ నాయకులనే కలవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేన నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం వచ్చిన సందర్భంలోనూ వచ్చిన అభిమానులను పట్టించుకోకపోవడం, జనసేన నాయకులను కలిసే యత్నం కూడా చేయకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలను తీసుకుని వచ్చిన నాయకులకు పవన్‌కల్యాణ్ వ్యవహరించిన తీరు బాధ కలిగించింది. బౌన్సర్ల చేతిలో అవమానాలు మాత్రం మిగిలాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment