సాక్షి, అమరావతి: శాసనమండలిలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని బుధవారం టీడీపీ దౌర్జన్యకాండకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొంది వచ్చిన బిల్లుల్ని ప్రభుత్వం బుధవారం మండలిలో ప్రవేశపెట్టే క్రమంలో టీడీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిపై నిండు సభలో టీడీపీ ఎమ్మెల్సీలు కాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకున్న పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలపైనా దౌర్జన్యం చేసి తోసివేశారు. టీడీపీ ఎమ్మెల్సీల దాదా గిరితో సభలో అరగంట సేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. నినాదాలు
► ద్రవ్య వినిమయ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్లో ఏది మొదట తీసుకోవాలనే విషయంపై వివాదం ఏర్పడి సభ మూడు గంటలపాటు స్తంభించింది. ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.
► చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఏమీ జరక్కుండానే తమకు అనుకూలంగా జరిగినట్లు బల్లలు చరిచి అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టారు.
► ఈ దశలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో పలువురు ఎమ్మెల్సీలు గొడవకు దిగారు. చివరికి ఆయనపై ఒక్కసారిగా దాడి చేశారు.
► బీద రవిచంద్ర వెలంపల్లిని కాళ్లతో తన్నగా, మంతెన సత్యనారాయణరాజు ఆయన మెడ పట్టుకుని తోసివేశారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వచ్చి వారిని ఆపి, మంత్రిని పక్కకు తీసుకువచ్చారు.
► ఆ తర్వాత కూడా బీద రవిచంద్ర మంత్రిపైకి దూసుకువచ్చి మళ్లీ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోపు మిగిలిన మంత్రులు వచ్చి అడ్డుకున్నారు.
ఫొటోలు, వీడియోలు తీసిన లోకేష్
► నారా లోకేష్ ఫొటోలు, వీడియోలు తీయడమే ఈ గొడవకు కారణమైంది. డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో మంత్రులు నిబంధనల గురించి పోడియం ఎదుట నిలబడి మాట్లాడుతుండగా లోకేష్ వెనుక నుంచి ఫొటోలు, వీడియో తీశారు. మధ్యాహ్నం నుంచి సభ జరుగుతున్నంత సేపు ఆయన తన ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు.
► ఈ క్రమంలో ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వెలంపల్లి ప్రశ్నించడంతో బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు ఆయనపై దాడి చేశారు. దాడి సమయంలోనూ లోకేష్ ఫొటోలు తీస్తూనే ఉన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ ఫొటోలు తీయొద్దని పదేపదే లోకేష్‌ను కోరినా ఆయన పట్టించుకోలేదు.
► మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌లు లోకేష్ ఫోన్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు తొలగించాలని డిప్యూటీ చైర్మన్‌ను అడుగుతున్నప్పటికీ, ఆయన వెనుక నుంచి ఇంకా ఫొటోలు తీస్తూనే ఉన్నారు.
► ఇలా ఫొటోలు తీసి మంత్రులు, అధికారపక్ష సభ్యుల్ని రెచ్చగొట్టి, ఘర్షణకు కారణమైన లోకేష్.. చివర్లో గొడవ మరింత పెద్దదైన సమయంలో మెల్లగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సభ అదుపులో లేదు కాబట్టి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించి వెళ్లిపోయారు.
సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి?
► బిల్లులపై ఓటింగ్ పెట్టాలని యనమల డిమాండ్ చేయగా, ఇవి కరోనా సమయంలో అత్యవసరంగా పెట్టిన అసెంబ్లీ సమావేశాలని.. ప్రభుత్వ బిజినెస్ కోసమే జరుగుతున్నాయని మంత్రి బుగ్గన అన్నారు.
► మధ్యలో ద్రవ్య వినిమయ బిల్లు పెడితేనే సహకరిస్తామని, లేకపోతే తాను వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఇచ్చిన రూలు 90 నోటీసు తీసుకోవాలని యనమల కోరారు.
► బుగ్గన దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అజెండా ప్రకారం సభ నడపకుండా ఆరు బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. శాసన మండలి ఉన్నది ప్రభుత్వం పని చేయకుండా ఉండేందుకా అని ప్రశ్నించారు. ఎటూ తేలక సభ స్తంభించడంతో డిప్యూటీ ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
► అనంతరం మళ్లీ ఇదే వివాదం నెలకొంది. డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ ఏకాభిప్రాయం రానప్పుడు తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు చివర్లో పెట్టాలనే సంప్రదాయం పాటించాల్సిన అవసరం లేదని, ఈ సభలోనే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతానని తెలిపారు.
ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం తీసుకోండి
► మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ.. సభ మూడ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, మిగిలిన పార్టీ ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రతి చిన్న విషయానికి కీచులాటకు దిగడం సరికాదని, ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు.
► సభలో మిగిలిన పక్షాల అభిప్రాయాలు ఎందుకు తీసుకోరని, కేవలం టీడీపీ అభిప్రాయమే ఎందుకు తీసుకుంటారని బుగ్గన ప్రశ్నించారు.
► ఒక దశలో తనకు ఈ ప్రభుత్వం ఎస్కార్టు తీసివేసిందని డిప్యూటీ చైర్మన్ చెప్పగా, టీడీపీ హయాంలో తాను ప్రతిపక్ష నేతగా ఎన్నికైనా.. నెల రోజులు ధృవీకరించకుండా ఇంకెవరైనా వైఎస్సార్‌సీపీ సభ్యులు టీడీపీలోకి వస్తే తనకు ఆ అవకాశం లేకుండా చేయాలని చూసిన విషయాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా రూలు 90 తీసుకున్న యనమల
► చర్చ జరుగుతుండగానే రూలు 90పై తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై అభ్యంతరం చెప్పారు. ఆ రెండు బిల్లులపై రూలు 90 ప్రకారం తాను చెప్పిన విషయాలు రికార్డుల్లోకి వెళ్లిపోయాయని తెలిపారు.
► అసలు చైర్మన్ అనుమతివ్వకుండా ప్రతిపక్ష నేత ఎలా దాన్ని పెడతారని బుగ్గన ప్రశ్నించగా డిప్యూటీ చైర్మన్ అది రికార్డుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు.
► అసలు రూలు 90 తీసుకోవడానికే లేదని, దాన్ని ఒకరోజు ముందు ఇవ్వాలని, కానీ ఈరోజే ఇచ్చారని, అలాగే సభా నాయకుడు, శాసనసభా వ్యవహారాల మంత్రిని సంప్రదించిన తర్వాతే ఆ నోటీసుపై నిర్ణయం తీసుకోవాలని రూలు 94 చెబుతోందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిబంధనావళిని చదివి వినిపించారు.
అసలు రూలు 90ని ఎలా అడ్మిట్ చేశారు?
► ప్రతిపక్ష నేత చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాలని బుగ్గన, బొత్స, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు కోరారు.
► ‘ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు రూల్ బుక్‌ను వల్లెవేస్తారు కానీ పాటించరు. టీడీపీ ఇచ్చిన రూలు 90 నోటీసును చైర్మన్ ఎలా అనుమతిస్తారు? దానిపై ఎలా హక్కు ఉంటుంది? చైర్మన్ అనుమతించాడు కాబట్టి మేం దాన్ని సభలో పెట్టేస్తామంటే కుదరదు. విచక్షణాధికారం ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు వినియోగించకూడదు. రూలు 90ని అనుమతించేటప్పుడు సభా నాయకుడిని సంప్రదించాలనే రూలు 94ని రద్దు చేయడానికి చైర్మన్ ఎవరు? ప్రతిపక్ష నేత యనమల సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి టీడీపీ కార్యాలయం కాదు. అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తే కుదరదు. రూలు 94 బతికుందో.. చచ్చిపోయిందో చెప్పాలి. రూల్సు అమలు చేయనప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు?’ అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
► రూలు 90 తీసుకున్నాం కాబట్టి మిగిలిన బిల్లులు పెట్టాలని డిప్యూటీ చైర్మన్ కోరగా, మీ అనుమతి లేకుండా చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాకే ఆ బిల్లులు పెడతామని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. సభ ఉన్నది ప్రభుత్వ బిజినెస్ జరగాడానికా, లేక ఎక్కడి నుంచో తెచ్చిన రూలు 90 కోసమా అని డిప్యూటీ చైర్మన్‌ను ప్రశ్నించారు. ఏ సభలో అయినా ప్రభుత్వ బిజినెస్‌కు టాప్ ప్రయారిటీ ఉంటుందని చెప్పారు.
► మంత్రులు, అధికార పక్ష సభ్యులు దీనిపై ఎంత అడిగినా డిప్యూటీ చైర్మన్ వినకుండా టీడీపీ పక్షం చెప్పిందే వినడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
► ఈ పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు గొడవ పెట్టుకుని అధికారపక్షంపై దాడికి దిగారు. అదే సమయంలో యనమల సూచన మేరకు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఆరు బిల్లులు ఆమోదం పొందకుండా నిలిచిపోయాయి.
మండలిలో టీడీపీ శకునిపాత్ర
► శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ మరోసారి శకునిపాత్ర పోషించింది. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ ఆమోదించిన ఆరు బిల్లులకు అడ్డుపడి చివరికి అవి ఆమోదం పొందకుండా చేసింది. తెలుగుదేశం పార్టీ రాజకీయంతో బడ్జెట్ సమావేశాల్లో అతి కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు.
► వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులతోపాటు మరో మూడు బిల్లుల్ని ముందు ప్రవేశపెడతామని, చివర్లో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. కానీ యనమల.. ముందు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని పట్టుబట్టారు.
► ఎంతో అనుభవం ఉందని చెప్పే యనమల.. ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లును చివర కాకుండా ముందు ప్రవేశపెట్టిన దాఖలా ఉందా? ఉంటే చూపాలని మంత్రి బుగ్గన కోరారు. ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత ఇక ఏ బిజినెస్ జరగదని, అదే సంప్రదాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment