సాక్షి, విజయవాడ : శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతల దాడిని వైఎస్సార్‌సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ గుణదలలోని అతని నివాసం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్లు, డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పెద్దల సభలో టీడీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడికి పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీగా అర్హత లేని టీడీపీ సభ్యులు మండలిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులను మండలికి పంపితే వాటిని అడ్డుకోవడం హేయమైన చర్య అని అవినాష్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే.. టీడీపీ నేతలు వ్యవస్థలను, కోర్టులను అట్టుపెట్టుకొని అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దాడిని టీడీపీ నాయకులు హీరోయిజంగా చెప్పుకుంటున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. దాడి చేనినవారిపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని దేవినేని అవినాష్ హెచ్చరించారు.
బిల్లులను అడ్డుకోవడం దురదృష్టకరం : బొప్పన భవకుమార్
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులు పాస్ కాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ అన్నారు. పెద్దల సభలో రౌజీయిజం చేయడం టీడీపీ పార్టీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. శాసనమండలిలో మంత్రిపై దాడి చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ సభ్యులు రౌడీలు, గుండాలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విధ్వంశాలు చేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment