సాక్షి, ప్రొద్దుటూరు : సోదాలకు వచ్చిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. వారి విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇవ్వకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. టీటీడీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో చోటుచేసుకున్న ఈ బరితెగింపు వివరాలిలా ఉన్నాయి.. పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ఐటీ అధికారులు వచ్చారు. ఆ సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్ కుమారుడు మహేష్‌యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా మహేష్‌యాదవ్ కొన్ని పేపర్లను నలిపి బయట పడేయడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఇంతలో ఎంపీ సీఎం రమేష్, అతని వెంట కౌన్సిలర్ వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి పుట్టా ఇంట్లోకి కేకలు వేసుకుంటూ వెళ్లారు. సీఎం రమేష్ నేరుగా ఐటీ అధికారులందరిపై కేకలు వేశారు. ‘ఎవరు పంపారు, ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయడానికి మీకు ఎంత ధైర్యం’.. అంటూ మండిపడ్డారు.
తనిఖీలు చేయకుండా అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను లోపలికి తీసుకెళ్లి వారి సాక్షిగా అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మిమ్మల్ని ఎవరు పంపారో మీడియాకు చెప్పాలంటూ కడప ఐటీ అసిస్టెంట్ కమిషనర్ మహాదేశ్‌పై తీవ్ర ఒత్తిడి చేశారు. ‘మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము తనిఖీలు చేస్తున్నాం.. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆయనన్నారు. దీంతో ఆయన చేతిలోని సూట్‌కేసును టీడీపీ నాయకులు లాక్కున్నారు. రమేష్ దానిని తెరిచారు. అందులోని పేపర్లను వీఎస్ ముక్తియార్ తీసి బయట వేయగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విసిరికొట్టారు. మీడియాలో భారీగా డబ్బు, బంగారం దొరికిందని వస్తోందని.. ఏమీ దొరకలేదని చెప్పాలంటూ అసిస్టెంట్ కమిషనర్‌ను ఎంపీ ఒత్తిడిచేశారు. మీరు ఏమీ దొరకలేదని చెప్పకపోతే మా వాళ్లు వందల మంది వస్తారని, లా అండ్ ఆర్డర్ తప్పుతుందని హెచ్చరించారు. చెప్పేంత వరకు బయటకు వెళ్లనివ్వబోమని చుట్టుముట్టారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వారి వాహనాల్లో వెళ్లిపోయారు.
పక్కా సమాచారంతోనే సోదాలు
మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి రెండు రోజుల కిందట భారీగా డబ్బు వచ్చిందన్న పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. తనిఖీల్లో ఆ డబ్బు ఎక్కడ బయట పడుతుందోనని రమేష్ వారి విధులకు ఆటంకం కలిగించినట్లు స్పష్టమవుతోంది. ఇంట్లో భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారని, దీంతో అధికారులపై దౌర్జన్యంచేసి వారు వెళ్లిపోయేలా చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, పుట్టా ఇంటికి చేరుకున్నారు. వారు మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులకు వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లో పథకం రూపొందించారని, కేంద్రంతో కలిసి దాడులు చేయించారని ఆరోపించారు.
ఎస్కార్ట్‌గా ఇద్దరు కానిస్టేబుళ్లే..
జిల్లా ఐటీ అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు మరో ఏడుగురు అధికారులు అధికార పార్టీ నాయకుని ఇంట్లో సోదాలు చేసేందుకు వస్తే పోలీసు అధికారులు కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ నాయక్, డీఎస్పీ శ్రీనివాస్‌రావు వచ్చి ఘటనపై వాకబు చేసి వెళ్లిపోయారు. ఐటీ అధికారులపై ఎంపీ, టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి నిర్బంధించినంత పనిచేసినా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసీ అధికారి స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చిన అధికారులకు పోలీసులు ఎందుకు బందోబస్తు కల్పించలేకపోయారనే విషయం చర్చనీయాంశమైంది. ఐటీ సోదాలు జరిగే ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించరు. అక్కడ కానిస్టేబుళ్లు మాత్రమే ఉండడంతో టీడీపీ నేతలు బలవంతంగా లోపలికి వెళ్లి అధికారులపై దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉన్న ఓ ఐటీ ఉన్నతాధికారిపై భౌతిక దాడికి దిగినంత పనిచేసిన టీడీపీ నాయకులపై, తనిఖీలు చేయకుండా విధులకు అడ్డుకున్న సీఎం రమేష్‌పై కనీసం ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment