సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రభావాన్ని తగ్గించడం కోసం, ప్రభావం ఏమీ లేనట్లుగా భ్రమను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన్ను అనుసరించే ఎల్లో మీడియా ప్రయత్నించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రను దెబ్బతీసేందుకు ఆది నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేశారని చెప్పారు.
అందులో భాగంగా పాదయాత్ర పది రోజులు పూర్తి చేసుకున్న తర్వాత వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేతో పార్టీ ఫిరాయించేలా చేయాలని కుట్ర పన్నారని సంచలన ఆరోపణ చేశారు. ఒక పథకం ప్రకారం పాదయాత్ర విజయాన్ని అడ్డుకోవాలనుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చంద్రబాబు కలలో కూడా ఊహించని విధంగా మారిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు స్వతంత్రంగా వచ్చి వైఎస్ జగన్‌తో కలసి పాదయాత్రలో అడుగులో అడుగు వేశారని వెల్లడించారు.
వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చంద్రబాబుకు కునుకు లేకుండా చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రకాశం బ్యారేజీ, గోదావరి వంతెనలు జన ప్రవాహాన్ని కూడా చూశాయని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతంలో పాడేలా ప్రజాసంకల్పయాత్ర దినదిన ప్రవర్ధమానంగా సాగుతోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు వైఎస్ జగన్‌తో కలసి నడుస్తున్నాయని, ప్రజాసంకల్పయాత్రతో ప్రజలకు వైఎస్ జగన్ మరింత చేరువయ్యారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment