సాక్షి, అమరావతి: ఏడుగురు దళిత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి మొండిచేయి చూపించారు. వారికి మళ్లీ సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. 14 మందికి మాత్రం అవకాశమివ్వలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ 102 స్థానాల్లో గెలుపొందింది. నవతరం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆ తరువాత టీడీపీతో అసోసియేట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో మేడా మల్లికార్జునరెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌లు వైఎస్సార్‌సీపీలో, రావెల కిషోర్‌బాబు జనసేనలో చేరి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో టీడీపీ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. వీరితోపాటు వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలుపుకుంటే ప్రస్తుతం టీడీపీకి 121 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 107 మందికి తిరిగి సీట్లిచ్చిన చంద్రబాబు 14 మందికి సీట్లు నిరాకరించారు. అందులో ఏడుగురు ఎస్సీలు, ఒక గిరిజనుడు ఉన్నారు. పి.గన్నవరంలో పులపర్తి నారాయణమూర్తి, చింతలపూడిలో పీతల సుజాత, యర్రగొండపాలెంలో పాలపర్తి డేవిడ్‌రాజు, బద్వేలులో జయరాములు, కోడుమూరులో మణిగాంధీ, శింగనమలలో యామినీబాల, సత్యవేడులో తలారి ఆదిత్యకు సీట్లివ్వలేదు.
గిరిజనులకు కేటాయించిన పోలవరంలో మొడియం శ్రీనివాస్‌కు సీటు నిరాకరించారు. ఇక జనరల్ స్థానాల విషయానికి వస్తే.. విజయనగరంలో మీసాల గీత, ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు, కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి, కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి, కదిరిలో అత్తార్ చాంద్‌బాషాకు మళ్లీ సీట్లివ్వలేదు. నలుగురు ఎమ్మెల్యేలకు సిట్టింగ్ స్థానాలు కాకుండా వేరే నియోజకవర్గాల సీట్లివ్వగా, ఇద్దరు మంత్రులకు ఎంపీ సీట్లిచ్చారు. గంటా శ్రీనివాసరావును భీమిలి నుంచి విశాఖ నార్త్‌కు, వంగలపూడి అనితను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు, మంత్రి జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు, కదిరి బాబూరావును కనిగిరి నుంచి దర్శికి మార్చారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజుకు నర్సాపురం, దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శిద్ధా రాఘవరావుకు ఒంగోలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డిని కడపకు, చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు రాజంపేట ఎంపీ సీట్లిచ్చారు. కాగా, టీడీపీలో 9 మంది వారసులకు సీట్లు దక్కాయి.
సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యం: సీట్ల కేటాయింపులో చంద్రబాబు సొంత సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 38 స్థానాలను తన వర్గం వారికే కట్టబెట్టారు. గుంటూరు జిల్లాలోనే తన వర్గం వారికి ఎనిమిది సీట్లు కేటాయించగా, కృష్ణా జిల్లాలో ఐదు, అనంతపురంలో ఐదు, చిత్తూరు జిల్లాలో నాలుగు సీట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన చూస్తే ఆ వర్గానికి ఈ కేటాయింపు చాలా ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు 41 సీట్లు కేటాయించడం, అదే సమయంలో ఐదు శాతం కూడా లేని తన వర్గానికి 38 సీట్లు కేటాయించడాన్నిబట్టి సీఎం చంద్రబాబు ప్రాధామ్యాలు అర్థమవుతున్నాయన్న విమర్శ వినిపిస్తోంది. బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీలకు ఎప్పుడూ ఇచ్చే సీట్లే తప్ప అదనంగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. 25 ఎంపీ స్థానాలకు గానూ ఆరు స్థానాలను తన సామాజికవర్గానికే కేటాయించగా బీసీలకు ఐదు సీట్లే ఇచ్చారు.
ఏడుగురు దళిత సిట్టింగ్‌లపై వేటు
Published Wed, Mar 20 2019 3:49 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment