లాలూ ప్రసాద్ తనయులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్
పట్నా, బిహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయంటూ వచ్చిన వార్తలపై ఆయన చిన్న కుమారుడు, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘మా అన్నయ్య(తేజ్ ప్రతాప్ యాదవ్) నా మార్గదర్శి. 2019 లోక్‌సభ, 2020లో బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. తేజస్వీ దమ్మున్నవాడని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన నా సోదరుడు, గైడ్ కూడా’ అంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బిహార్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్న తేజస్వి.. వాటి నుంచి ప్రజల దృష్టి మరలించడానికే కొంతమంది ఇలాంటి చౌకబారు వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 మార్కులకు 38 మార్కులు రావడం, 44 మంది మహిళలపై అత్యాచారాలు జరగడం ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. విద్యావ్యవస్థ ఏ విధంగా నాశనమౌతోందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. ఇలాంటి అంశాలను తేలికగా తీసుకుంటే రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తేజస్వీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా రెండు రోజుల క్రితం తేజ్ ప్రతాప్.. మహాభారత పర్వాన్ని ఉటంకిస్తూ.. ‘అర్జుడిని రాజు చేశాక.. ద్వారక వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ కొంతమందికి నన్ను కింగ్‌మేకర్ అనడం అస్సలు ఇష్టం లేనట్లుందంటూ’ ట్వీట్ చేశారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత తేజస్వీ యాదవ్ అంతా తానై పార్టీని ముందుండి నడిపిస్తూ ఉండడంతో తేజ్‌ప్రతాప్ ఈవిధంగా అక్కసు వెళ్లగక్కారంటూ వదంతులు ప్రచారమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment