కొల్చారంలో సిద్ధం చేసిన నామినేషన్ పత్రాలు
మెదక్ రూరల్: మూడు విడతల ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో ఈనెల 26 (శుక్రవారం) నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కానుంది. రెండో విడతలో మొత్తం ఆరు మండలాలకు గాను 6 జెడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరగనుంది. ఈనెల 26న రెండో విడుత నామినేషన్ల స్వీకరణ, మే 10న పోలింగ్ జరగనుంది. మే 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ ప్రకటించింది. రెండో విడతలో నర్సాపూర్ డివిజన్ కేంద్రం నుంచి నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్ డివిజన్ నుంచి వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆయా మండలాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు గతంలో జిల్లా కేంద్రంలోనే నామపత్రాలను స్వీకరించగా, ప్రస్తుతం మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఆయా మండల కేంద్రాల వద్ద బారికేడ్స్, కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రం వద్ద ముగ్గురు రిటర్నింగ్ అధికారులు, ముగ్గురు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. కాగా మొదటి విడత ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది.
Comments
Please login to add a commentAdd a comment