
సాక్షి, ఆదిలాబాద్: ప్రాదేశిక ఎన్నికల సందడి మరికొన్ని మండలాలకు పాకనుంది. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా ఆదిలాబాద్‌అర్బన్ మండలం మినహాయించి మిగతా 17 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 13 పాత మండలాలు ఉండగా, నాలుగు కొత్త మండలాలు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లో జరగనుండగా రెండో విడత ఎన్నికలు ఐదు మండలాల్లో జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
రసవత్తరం..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబం ధించి మొదటి విడతలో ఆదిలాబాద్‌రూరల్, మావల, జైనథ్, బేల, తాంసి, భీంపూర్ మండలాల్లో బుధవారంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. గురువారం నామినేషన్ల పరిశీలన కొనసాగింది. ఆదివారం ఉపసంహరణ ఘట్టం తర్వాత ఆయా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎంతమంది, ఎవరు బరిలో ఉంటారనేది తేలనుంది. ప్రధాన పార్టీల నుంచి అన్నిచోట్ల పోటీలో ఉన్నారు. ఇక మొదటి విడతలోని ఆరు మండలాల్లో ప్రచార పర్వం జోరందుకోనుంది. మొదటి విడతలో మే 6న పోలింగ్ జరగనుండగా అంతకు ముందు మే 4 సాయంత్రం వరకు ప్రచారం సాగనుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
ఆశావహుల సందడి..
రెండో విడతలో పలు జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఇక్కడ పోటీ వాతావరణం కనిపిస్తోంది. రిజర్వేషన్ల ప్ర కటనతోనే పలువురు ఆశావహులు ఆయా మండలాల్లో పోటీ –
చేయాలని ముందుగానే నిశ్చయించుకొని ఉన్నారు. మరోపక్క ఈ ఐదు మండలాల్లో గతంలో టీఆర్‌ఎస్ గెలుపొందింది. బోథ్ నియోజకవర్గంలోని మండలాలైన వీటిలో టీఆర్‌ఎస్ కేడర్ బలంగా ఉన్నా ప్రత్యర్థులను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ ఎస్టీ(జనరల్) రిజర్వ్ కాగా, ఇప్పుడు ఎస్టీ రిజర్వ్ అయిన స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లోనూ చైర్మన్ పదవి ఆశావహులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పలు జనరల్ స్థానాల్లో అభ్యర్థులు ఎవరెవరు రంగంలోకి దిగుతారనే దానిపై ఆయా మండలాల్లో ఆసక్తి నెలకొంది.
నేరడిగొండ ఆసక్తికరం..
నేరడిగొండ ఎస్టీ(జనరల్) రిజర్వ్ కావడంతో అక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అనిల్‌జాదవ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి 28వేల ఓట్లు సాధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు అతను టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన జెడ్పీచైర్మన్ పదవి ఆశిస్తూ రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అయితే బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఇప్పుడు జెడ్పీచైర్మన్ అయ్యే వ్యక్తి ఐదేళ్ల తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు నేరడిగొండ జెడ్పీటీసీ అభ్యర్థి విషయంలో ఎలాంటి ఎత్తుగడ అవలంబిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.