సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ పూర్తి స్థాయిలో ఎదగలేకపోయిం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ సొంతంగా గెలవలేదని, బీజేపీ వల్లనే గెలిచారని పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1998 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సొంతంగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలవడంతోపాటు, ఆంధ్రా లో 17 శాతం, తెలంగాణలో 21 శాతం ఓట్ల శాతం సాధించిందన్నారు. అలాంటి స్థితి నుంచి 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత తమ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారన్నారు. 2014లో కూడా విధిలేని పరిస్థితుల్లో బీజేపీతోనే టీడీపీ పోటీ చేసిందని గుర్తుచేశారు. 2019లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసొస్తే మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. జీహెచ్‌ఎంసీ, ఇతర స్థానిక అధికార యంత్రాంగాలపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నందున, ఎవరి ఓట్లు తొలగించాలన్న విషయంలో ఒక లక్ష్యంతో వ్యవహరించారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన ముషీరాబాద్‌లోనే ఆయా సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. కొత్త ఓటర్ల నమోదులోనూ జీహెచ్‌ఎంసీ పటిష్ట చర్యలు తీసుకోకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు.
మోదీనే మా ఐకాన్...
లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తమ ఐకాన్ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీ మిత్రత్వం అనే ప్రశ్నే తలెత్తదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలిచినా కేసీఆర్ ప్రధాని కాగలరా, ప్రజలెందుకు ఆ పార్టీకి ఓటేయాలని ప్రశ్నించారు. పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని లక్ష్మణ్ వెల్లడించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి సీట్లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన లోక్‌సభకు పోటీ చేయకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో పాటు కొన్ని సీట్లు గెలుచుకుంటామనే విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే నెల 2వ తేదీ తర్వాత ఒక్కో నియోజకవర్గం నుంచి అర్హులైన ముగ్గురి పేర్లను ఎంపీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, కమిటీ నిర్ణయించి జాతీయ నాయకత్వానికి పంపుతామన్నారు. వీవీప్యాట్‌లతో అనుసంధానం, సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు పోలింగ్ ఒక గంట పెంచాలని, సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లు మార్చాలని కోరారు. ఈసీ ద్వారానే వంద శాతం ఓటింగ్ స్లిప్‌లు పంపిణీ కాకపోతే, రాజకీయ పార్టీల కు ఆ అవకాశం ఇవ్వాలన్నారు. ఒక కుటుంబం ఓట్ల న్నీ ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవాలని, దీనిపై ఈ నెల 18న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)ని బీజేపీ ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జాతీయ పార్టీ నిర్దేశించిన ఐదు అంశాలపై రాష్ట్రంలో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
టీడీపీతో పొత్తు వల్లే ఎదగలేకపోయాం
Published Sun, Feb 17 2019 1:19 AM | Last Updated on Sun, Feb 17 2019 1:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment