
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ‘రఫేల్’ భయం పట్టుకుంది. ఆ మాట వింటేనే వారిలో ఆందోళన కనిపిస్తోంది. అదేంటి.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన అస్త్రం అదే కదా? ఈ అంశంతోనే కదా కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెడుతోంది. అలాంటిది ఈ విషయంలో కాంగ్రెస్ నేతలకు భయమెందుకు అంటారా? ఇక్కడే అసలు విషయం ఉంది. తెలంగాణలో రఫేల్ అంశం వల్ల తమకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని టీపీసీసీ నేతల భావన. రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తే ప్రయోజనం ఏమీ ఉండదని, టీఆర్‌ఎస్ లక్ష్యంగానే రాహుల్ ప్రసంగం ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే రాహుల్‌గాంధీ.. ఆ ఒక్క అంశం తప్ప మిగిలినవాటిపై దృష్టిసారిస్తే బావుంటుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రచారం చేస్తున్నా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం.. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదమే. బీజేపీ, మోదీ లక్ష్యంగానే ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల రెండ్రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్ రెండు బహిరంగ సభల్లోనూ రఫేల్ డీల్ పైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. బీజేపీని టార్గెట్ చేసుకుని అస్త్రాలు సంధించారు. అయితే.. ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన టీఆర్‌ఎస్‌పై కాకుండా బీజేపీపై పోరాడితే పార్టీకి ఎన్నికల్లో చేకూరే ప్రయోజనం పెద్దగా ఉండదని రాష్ట్ర నేతలంటున్నారు. రఫేల్ గురించి గొంతు చించుకున్నా తెలంగాణలో కలిసిరాదనేది వారి ఆవేదన. అందుకే రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను పేర్కొంటూ వీరు ఓ నోట్ సిద్ధం చేశారు. అందులో ఏముందని ఓ సీనియర్ కాంగ్రెస్ నేతను అడగ్గా.. రాఫెల్ తప్ప అన్నీ ఉన్నాయని నవ్వుతూ బదులిచ్చారు.
టార్గెట్ టీఆర్‌ఎస్
‘వచ్చే ఎన్నికల్లో మా కూటమికి ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్. అలాంటప్పుడు బీజేపీపై ఎంతగా అరచి గగ్గోలు పెట్టినా తెలంగాణలో మాకు పెద్దగా ఒరిగేది ఏముంటుంది. అందుకే.. టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చని వైనంపై ఓ నివేదిక తయారు చేశాం. వాటినే ప్రధానంగా తీసుకుని ఓ నోట్‌ను సిద్దంచేశాం. దీనిలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, డబుల్ బెడ్‌రూమ్, దళితులకు మూడెకరాలు, పాలమూరు ఎత్తిపోతల పథకం, పేదలకు ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, కేజీ టూ పీజీ వంటి హామీలకు సంబంధించి సవివరమైన పాయింట్లు చేర్చాం. బంగారు తెలంగాణకు బదులుగా కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ బంగారంలా కలిసి వచ్చిందన్నది ఉదాహరణలతో సహ వివరించాం. ఇవి కాకుండా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సీఏం ఏళ్లతరబడి సచివాలయానికి రాకపోవడం వంటి చాలా విషయాలుంటాయి’అని ఆ సీనియర్ కాంగ్రెస్ నేత వివరించారు. ఇక రాజకీయానికి వస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్ సమన్వయంతో ముందుకు వెడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల కోరిక. ఈ విషయాన్ని తమద్వారా కాకుండా రాహుల్ నోటివెంటచెప్పిస్తే.. ప్రాధాన్యత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
రాహుల్ అంగీకరిస్తారా?
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆరాటం సరే.. వీరు సిద్దం చేస్తున్న ప్రసంగం నోట్‌ను రాహుల్ ఆచరిస్తారా? రాఫెల్‌ను కాదని స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారా? అంటే స్పష్టమైన సమాధానం దొరకడం లేదంటున్నారు. తాము చెప్పింది రాహుల్ అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నామన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రచారంలో భాగంగా.. రాహుల్‌కు అక్కడ 15ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాల గురించి మాట్లాడాలని రాష్ట్ర నేతలు పెద్ద చిట్టా తయారుచేసి ఇచ్చారు. అయితే రాహుల్ మాత్రం.. వీటన్నింటికీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. తన 50 నిమిషాల ప్రసంగంలో దాదాపు 40 నిమిషాల పాటు రాఫెల్ ఒప్పందం, కేంద్రంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపైనే మాట్లాడారు. అయితే మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై రాహుల్ పొడిపొడిగా మాట్లాడారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఈసారి మరింత జాగ్రత్త పడాలని ఆలోచిస్తున్నారు. రాహుల్ పర్యటనకు రెండ్రోజుల ముందే.. ఢిల్లీ వెళ్లి తెలంగాణ సభల్లో ఏం మాట్లాడాలన్నది ఆయనకు విడమరిచి చెప్పాలనుకుంటున్నారు. మంచి ప్రయత్నమే.. కానీ రాహుల్ వీరి మొరను ఆలకిస్తారా!
Comments
Please login to add a commentAdd a comment