ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ‘కాంగ్రెస్ విజయభేరి’ బహిరంగ సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న సోనియా, రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ, ఎంఐఎం సహా ఎవరు మద్దతుగా వచ్చినా సరే వంద రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్‌ఎస్‌తోనే కొట్లాడటం లేదని.. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని.. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘కాంగ్రెస్ విజయభేరి’సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
అటు కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాలతోపాటు రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో బీజేపీ విస్తరింపజేస్తున్న హింసను, విద్వేషాన్ని అడ్డుకుని ప్రేమను పంచేందుకు తాము ‘విద్వేషపు మార్కెట్లో ప్రేమ దుకాణం’ తెరిచామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని.. ఆ వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ (బంధువుల) సమితి. పార్లమెంటులో బీజేపీకి అవసరమైన ప్రతీ సందర్భంలో బీఆర్‌ఎస్ మద్దతు పలకడం నా కళ్లతో చూశాను. కిసాన్ బిల్లులు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, జీఎస్టీ తదితరాలపై నరేంద్ర మోదీ ఒక్క సైగతోనే బీఆర్‌ఎస్ మద్దతు పలికింది. ఈ రోజు తుక్కుగూడ బహిరంగ సభ జరుపుతుంటే ఆ మూడు పార్టీలు ఒకేసారి సభలు నిర్వహించి కాంగ్రెస్‌కు అంతరాయం కలిగించాలనుకున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండటం వల్ల మా బహిరంగ సభ విజయవంతమైంది. రాజకీయాల్లో ఎవరితో కొట్లాడుతున్నామో, మనకు వ్యతిరేకంగా నిలిచే శక్తులేంటో పూర్తి అవగాహనతో ఉండాలి.
ఆరు గ్యారంటీ పథకాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న రాహుల్ గాంధీ, ఖర్గే. చిత్రంలో మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనర్సింహ, అశోక్ గెహ్లోత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి, కేసీ వేణుగోపాల్, ఠాక్రే, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, జీవన్‌రెడ్డి తదితరులు
కేసీఆర్‌పై కేసులు పెట్టడం లేదేం?
కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కొత్త మార్గాల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు పరస్పరం ఫోన్లు చేసుకుంటాయి. మేం ఎక్కడ బీజేపీతో కొట్లాడుతామో ఆయా రాష్ట్రాలకు ఎంఐఎం వచ్చి అంతరాయం కలిగిస్తుంది. ఈ మూడు పార్టీలు భాగస్వాములుగా మారి ప్రజలకు నష్టం చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తు న్న మోదీ ప్రభుత్వం.. అవినీతిలో అన్ని రికార్డులు బద్దలుకొట్టిన కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క కేసూ పెట్టడం లేదేం? ఎంఐఎం నేతలపైనా ఎలాంటి కేసులు పెట్టడం లేదేం? కేవలం విపక్షాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? కేసీఆర్‌ను, ఎంఐఎంను తనవారిగా భావిస్తున్నందునే ప్రధాని మోదీ వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు.
ఒక్క కుటుంబం కోసం ఇవ్వలేదు
కేసీఆర్ లాభం కోసం, ఒక్క కుటుంబం కోసం మేం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. పేదలు, రైతులు, మహిళలు, కూలీల కోసం తెలంగాణ ఇచ్చాం. కానీ ఇక్కడ అన్ని ప్రయోజనాలు సీఎం కుటుంబానికే అందుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణ ఇచ్చారు. ఇటీవలే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేర్చింది. తెలంగాణలో ఇచ్చిన ఆరు హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేస్తాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా కల: సోనియా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడటం తన కల అని, తెలంగాణలోని అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తుక్కుగూడ విజయభేరి సభలో సోనియాగాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రకటించిన ఆమె.. కొన్ని నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘నా సహచర నేతలతో కలసి తెలంగాణ వంటి గొప్ప రాష్ట్రానికి జన్మనివ్వడం ఎంతో సంతోషంగా ఉంది.
ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఇప్పుడు మా విధి. ఈ చారిత్రక దినోత్సవ సందర్భంలో మీతో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆరు గ్యారంటీలు ఇస్తున్నాం. అందులో ‘మహాలక్ష్మి’ పథకం మొదటిది. తెలంగాణ సోదరీమణులకు సాధికారత కల్పించే ఈ ప్రకటన చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తాం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ను ఇవ్వబోతున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సులలో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం’’ అని సోనియా హామీ ఇచ్చారు. తెలంగాణ సోదర సోదరీమణులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన సోనియా.. ‘జై హింద్.. జై తెలంగాణ’ నినాదంతో ముగించారు.
ప్రజల సొమ్మంతా కేసీఆర్ కుటుంబం చేతిలోకి..
దేశంలో అదానీ లబ్దికోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ విషయాన్ని లోక్‌సభలో మాట్లాడినందుకు నా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇక్కడ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ సొమ్మును తన కుటుంబానికి కట్టబెడుతున్నారు. కేసీఆర్ తన మద్దతుదారు కాబట్టే ఇక్కడ జరుగుతున్న అవినీతిపై మోదీ విచారణ జరిపించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఏళ్లుగా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తోంది.
కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగింది. ధరణి పోర్టల్ తెచ్చి ప్రజలు, దళితుల భూములు లాక్కున్నారు. రైతుబంధుతో పెద్ద రైతులకే లాభం జరుగుతోంది. పేదలకు ఇళ్లు నిర్మించలేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లను లీక్ చేశారు, 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసే లేదు. ఇవన్నీ ప్రజల సొమ్మును దోపిడీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంచుకున్న మార్గాలు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సొమ్మును వాపస్ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment