వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు విఫలం | Telangana Government Fail In The Case Of Migrant Workers | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు విఫలం

Published Mon, May 18 2020 3:37 AM | Last Updated on Mon, May 18 2020 3:37 AM

Telangana Government Fail In The Case Of Migrant Workers - Sakshi

 దీక్షలో ఉత్తమ్‌ తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: దేశ విభజన సమయంలో ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు వలస కార్మికులు పడుతున్నారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపిం చారు. వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతకు నిరసనగా ఆదివారం గాంధీభవన్‌లో దీక్ష నిర్వహించా రు. ఇందులో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీ సీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ పాల్గొన్నారు. సా యంత్రం నేతల దీక్షను ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ వలసజీవులను ఆదుకోవడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు. వారు కనీసం వసతి కల్పించలేదని, తిండి కూడా పెట్టలేకపోయారని విమర్శించారు.

నేరుగా లబ్ధి చేకూర్చాలి: లాక్‌డౌన్‌తో నష్టపోయిన వారికి నేరుగా లబ్ధి చేకూర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్ద మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడా రు. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై చూపిన శ్రద్ధ నష్టపోయిన వర్గాలపై చూపలేదన్నారు. మోదీతో రెండ్రోజులకోసారి మాట్లాడుతున్నట్లు చెబుతున్న సీఎం.. ప్రజల కోసం ప్యాకేజీ ఎందుకు అడగడం లేదన్నారు.

కరోనా ముసుగులో ప్రైవేటీకరణ..: కరోనా వైరస్‌ ముసుగులో కేంద్రప్రభుత్వం అన్నిరంగాలను ప్రైవేటీకరించేందుకు యత్నిస్తోందని దీనిపై ఉద్యమిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. కరోనా నియంత్రణకు గాను దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో బాధితులకు మరింత సాయం చేయాలని టీపీసీసీ కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ నేతృత్వంలో కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ఇందులో ఉత్తమ్, కుంతియాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నా యకులు, కార్యకర్తలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేసిన సాయాన్ని జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని కోరారు.

కాగా, ఈ సమయంలో కార్మికుల పని సమయాన్ని పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఇది కార్మిక హక్కులను కాలరాయడమేననన్నారు. అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని, దీనిపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న అనేక వర్గాలకు అండగా నిలిచేందుకు టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలో మరిన్ని ఉపకమిటీలు కూడా వేయాలని నిర్ణయించారు. అనంతరం ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు టీపీసీసీ ఖర్చులతో ఏర్పాటు చేసిన బస్సును ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించి పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement