సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎల్పీ విలీనానికి ముందు తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన వారందరికీ నోటీసులు ఇవ్వాలంటూ హై కోర్టులో వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. పార్టీ మారిన వారిని అనర్హలుగా ప్రకటించాలంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి గతంలో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎల్పీని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేసే కుట్ర జరుగుతుందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్దన్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, జాజుల సురేందర్‌కు నోటీసులు జారీ చేసింది.
దీంతో పాటు శాసన మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్‌స్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ షబ్బీర్ అలీ గతంలో హై కోర్టులో పిటిషన్‌ని దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ను కూడా విచారించిన కోర్టు మండలి ఛైర్మన్, కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. దాంతో పాటు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎం.ఎస్ ప్రభాకర్‌రావు, దామోదర్ రెడ్డి, సంతోష్ కుమార్, ఆకుల లలితకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment