పరిషత్‌ పీఠంపై టీఆర్‌ఎస్‌ | Telangana MPTC Elections TRS Leaders | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పీఠంపై టీఆర్‌ఎస్‌

Published Fri, Jun 7 2019 7:32 AM | Last Updated on Fri, Jun 7 2019 7:32 AM

Telangana MPTC Elections TRS Leaders - Sakshi

సరిత, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, పి, భరత్‌

ఉమ్మడి పాలమూరులో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా మారింది. గ్రామపంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు ఏ ఎన్నికలు జరిగినా పూర్తి ఆధిక్యత సాధిస్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు అందనంత వేగంతో ‘కారు’ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తరహాలోనే పరిషత్‌ ఎన్నికల్లో సత్తా చాటింది. మెజార్టీ ఎంపీపీ స్థానాలతో పాటు జెడ్పీ పీఠాలను క్లీన్‌స్వీప్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది.  

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జరిగిన ప్రతి ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేసుకుంటూ టీఆర్‌ఎస్‌ బలాన్ని మరింత పెంచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 13అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ, సర్పంచ్‌ ఎన్నికల్లోనూ మెజార్టీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ సాధించింది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జెడ్పీపీఠాలపై గులాబీ జెండా ఎగరవేయనుంది. ప్రాదేశిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో జెడ్పీచైర్మన్, వైస్‌ చైర్మన్, ఎంపీపీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే జెడ్పీ చైర్మన్‌ల ఎంపికపై ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. శుక్రవారం ఎంపీపీ, శనివారం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రత్యేక శిబిరాల్లో ఉన్నారు. శుక్రవారం జరగనున్న ఎంపీపీ ఎన్నికకు నేరుగా ఎంపీటీసీలు రానున్నారు. 

‘పేట’ జెడ్పీ పీఠం ఎవరికో..? 
ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభవంజనం సృష్టించింది. ఒక్కడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల ఐదు జిల్లాల్లోనూ మెజార్టీ జెడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మొత్తం 71 జడ్పీటీసీ స్థానాలకు 65 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ 5, బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సంపూర్ణ మెజార్టీ రావడంతో జెడ్పీ చైర్మన్ల పీఠాలను సైతం సొంతం చేసుకోనుంది. మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్మన్‌గా స్వర్ణసుధాకర్‌రెడ్డి(భూత్పూర్‌), నాగర్‌కర్నూల్‌ జెడ్పీ చైర్మన్‌గా పోతుగంటి భరత్‌(కల్వకుర్తి), వనపర్తి జెడ్పీ చైర్మన్‌గా లోక్‌నాథ్‌రెడ్డి(వనపర్తి), గద్వాల జెడ్పీ చైర్మన్‌గా  సరిత(మానవపాడు)పేర్లు దాదాపు పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. నారాయణపేట జిల్లా నుంచి అంజనమ్మ (కృష్ణా), అశోక్‌కుమార్‌ (ఊట్కూర్‌), వనజ (మక్తల్‌), అంజలి (నారాయణపేట) జెడ్పీ పీఠం ఆశించగా చర్చల తర్వాత ఇద్దరు తప్పుకున్నారు. ప్రస్తుతం అశోక్‌కుమార్, వనజలో ఎవరో ఒకరిని ఫైనల్‌ చేసే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్‌కి సంబంధించి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, గద్వాల, వనపర్తికి సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు శ్రీనివాస్‌గౌడ్‌లకు జెడ్పీ చైర్మన్‌ ఎంపిక చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది. గెలిచిన సభ్యులు శిబిరాల్లో ఉండగా, ఆయా పార్టీల అధినేతలు వ్యూహ రచనల్లో మునిగిపోయారు.
 
మెజార్టీ ఎంపీపీ స్థానాలు కారు ఖాతాలోకే..
ఉమ్మడి జిల్లాలోని 790 ఎంపీటీసీ స్థానాలకు 524 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్‌  కేవలం 148 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ 46 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. 90 శాతం పైగా ఎంపీపీ స్థానాలకు టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఎంపీపీ స్థానాలు కూడా అన్ని జిల్లాల్లో ఒకటి రెండు మినహా క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే మెజార్టీ లేని మండలాల్లోనూ ఎలాగైనా ఎంపీపీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లగా, బిజినేపల్లి, లింగాల, వెల్దండ, ఉప్పునుంతల, కోడేరు మండలాల్లో ఇరుపార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా దక్కించుకోవాలనే కసరత్తు చేశారు. ఈ మండలాలు ఎవరి ఖాతాలోకి వెళుతాయో శుక్రవారం తేలనుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ మిడ్జిల్, చిన్నచింతకుంట మండలాల్లో మాత్రమే మెజార్టీ సాధించలేదు. నారాయణపేట జిల్లాలోనూ ధన్వాడ, మక్తల్‌ మినహా అన్ని మండలాల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సొంతం చేసుకుంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో రెబల్, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ఒకటి చేసేందుకు నేతలు ఇప్పటికే చర్చలు జరిపారు. మెజార్టీ ఎవ్వరిదనేది తేలాల్సి ఉంది. గద్వాలలో మానవపాడు, ఉండవెల్లి తప్పా అన్నింటా పూర్తి మెజార్టీ వచ్చింది. వనపర్తి జిల్లాలో 12 మండలాల్లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ రాగా, రేవల్లిలో కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. వీపనగండ్లలో జూపల్లి వర్గం ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఎక్కువ స్థానాలు సాధించారు. 

నేడు ఎంపీపీ ఎన్నిక  
మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం 10గంటలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలించి పోటీలో ఉన్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఒంటిగంట వరకు ఉపసంహరణకు గడువు ఇస్తారు. మొదట కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. అందుకు అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

విప్‌ ధిక్కరిస్తే వేటే  

ఎంపీటీసీ సభ్యులు విప్‌ను దిక్కరిస్తే పార్టీ సభ్యత్వం కోల్పోనున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రిసైడింగ్‌ అధికారికి రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. తమ సభ్యుడు విప్‌ ధిక్కరించారంటూ ఆ పార్టీ విప్‌ నుంచి రాత పూర్వకంగా మూడు రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయరాదో తెలపాలంటూ ప్రిసైడింగ్‌ అధికారి సంబంధిత సభ్యుడికి నోటీసు జారీ చేస్తారు. దీనికి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత విప్‌ ధిక్కారణ జరిగిందా లేదా అన్నదానిపై ప్రిసైడింగ్‌ అధికారి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారు. అయితే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎన్నిక జరిగే రోజు మధ్యాహ్నం 11గంటలలోగా విప్‌ ధిక్కరించిన అభ్యర్థుల పేర్లను ఆర్డీఓకు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశాలకు కనీసం సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడే కోరం ఉన్నట్లు పరిగణించి ప్రక్రియను చేపడతారు. నిర్ణీత సమయానికల్లా కోరం మేరకు సభ్యులు రాకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement