అయిననూ.. పోయిరావలే!  | Telangana ZPTC And MPTC Elections TRS Winning Candidates Full Happy | Sakshi
Sakshi News home page

అయిననూ.. పోయిరావలే! 

Published Thu, Jun 6 2019 8:21 AM | Last Updated on Thu, Jun 6 2019 8:21 AM

Telangana ZPTC And MPTC Elections TRS Winning Candidates Full Happy - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : గులాబీ నేతలు క్యాంపుల బాట పట్టారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెలువడిన వెంటనే టీఆర్‌ఎస్‌ నాయకత్వం తమ సభ్యులను వివిధ ప్రాంతాలకు తరలించింది. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా.. ముందు జాగ్రత్తగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తమ ప్రతినిధులను క్యాంపులకు తరలి వెళ్లాలని హుకుం జారీ చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన తర్వాత రాత్రికి రాత్రి ఈ ఆదేశాలు జారీ అయ్యాయని, టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు బుధవారం ఉదయమే వేర్వేరుగా క్యాంపులకు వెళ్లిపోయారని చెబుతున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకోవాలంటే 16 మంది సభ్యుల బలం ఉండాలి.

కానీ, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకంగా.. 24 మంది సభ్యులతో కావాల్సిన సంఖ్య కంటే అదనంగా మరో ఎనిమిది మంది తో బలంగానే ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కేవలం 7 స్థానాల్లో విజయానికే పరిమితమైంది. ఇంత మెజారిటీ ఉన్నా.. ఈనెల 8వ తేదీన  జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక జరిగే వరకు 24 మంది సభ్యులతో క్యాంపు ఏర్పాటు చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించడం విశేషం. ఇదంతా ముందు జాగ్రత్తతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని .. పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, జెడ్పీటీసీ సభ్యుల క్యాంపుల ఏర్పాటు బాధ్యతను మాజీ ఎంపీ, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అప్పజెప్పారు. జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పార్టీ నాయకత్వం ఆయనను నియమించిన విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలోనే క్యాంపు ఏర్పాటయ్యిందని సమాచారం. ఈనెల 8వ తేదీన జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగే సమయానికి వీరందరినీ క్యాంపునుంచి జిల్లా కేంద్రానికి తీసుకురానున్నారు.

ఎంపీటీసీల క్యాంపుల బాధ్యత ఎమ్మెల్యేలకు..
మరో వైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీ సభ్యులతోనూ క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటిని బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పజెప్పారని సమాచారం. జిల్లా వ్యాప్తంగా 31 మండలాలకు గాను అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌కు 18 ఎంపీపీ (మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌) పదవులు దక్కుతున్నాయి. ఆరు మండలాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా..  ఇంకో ఏడు చోట్ల మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ మండలాల్లో ఒక విధంగా ఇరు పార్టీలకూ సమాన అవకాశాలు ఉన్నాయి. ఒక్క చండూరు మినహా మిగిలిన ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఉందని, ఈ మండలాల్లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ గెలవడమే కారణమని అంటున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం మొత్తంగా తమ సభ్యులందరినీ క్యాంపులకు తరలించింది.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీ సభ్యులను ఇప్పటికే క్యాంపుల్లో పెట్టారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జిల్లాలోని 349 ఎంపీటీసీ స్థానాలకు గాను 191 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐల స్థానాలు పోను ఇతరులు 14 మంది ఉండగా వారిలో అత్యధికులు టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కక రె»బల్స్‌గా పోటీ చేసి గెలిచిన వారే. ఇప్పుడు వీరందరినీ కాపాడుకునేందుకు క్యాంపులకు తీసుకువెళ్లారని అంటున్నారు. గత నెల 31వ తేదీన జరిగిన నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీఆర్‌ఎస్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సభ్యులనూ క్యాంపులకు తరలించింది. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు ఈ నెల 7వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది. కాగా, ఆ రోజే వారందరినీ క్యాంపులనుంచి ఆయా మండలాలకు తీసుకువస్తారని చెబుతున్నారు. మొత్తానికి కావాల్సినంత మెజారిటీ ఉన్నా. అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేంత బలం ఉన్నా.. ముందు జాగ్రత్తతో టీఆర్‌ఎస్‌ క్యాంపులను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement