అధ్యక్షులెవరో? | Telangana MPTC Elections TRS Winnings | Sakshi
Sakshi News home page

అధ్యక్షులెవరో?

Published Fri, Jun 7 2019 7:44 AM | Last Updated on Fri, Jun 7 2019 7:44 AM

Telangana MPTC Elections TRS Winnings - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ), మండల ప్రజా పరిషత్‌ ఉపాధ్యక్షులు (వైస్‌ఎంపీపీ) పదవులకు శుక్రవారం ఎన్నిక జరగనుంది. మొదటగా కోఆప్షన్‌ సభ్యులను, తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో కోఆప్షన్‌ సభ్యుల నామినేషన్లు స్వీకరణ, అనంతరం వాటి పరిశీలన జరుగుతుంది. పోటీలో నిల్చున్న అభ్యర్థులను ప్రకటించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించి కోఆప్షన్‌ సభ్యులను ఎన్నిక చేపట్టి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థే పోటీపడితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక జరుగుతుంది. కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తికాకపోతే ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణకు అవకాశం ఉండదు. ఎంపీపీ పదవుల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఆయా పదవులకు సంబంధించి రిజర్వేషన్లను పొందుపర్చిన విషయం తెలిసిందే. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకున్న నియమ నిబంధనలు కోఆప్షన్‌ సభ్యులకు కూడా వర్తించనున్నాయి. మండలంలో ఒకరిని, జెడ్పీలో ఇద్దరి చొప్పున మైనార్టీ వర్గాలకు చెందిన వారిని  కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకోనున్న విషయం తెలిసిందే. 

రేపు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక.. 

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసి శనివారం ఎన్నిక చేపట్టనున్నారు. ముందుగా ఉదయం 10 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించి మధ్యాహ్నం వరకు పరిశీలిస్తారు. తద్వారా నామినేషన్ల ఉపసంహరణ చేపట్టి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ఎన్నికైన వారిలో సగం మంది సభ్యుల కోరం ఉంటేనే ఎన్నిక నిర్వహించిన కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. సాయంత్రం 3 గంటల సమయంలో జిల్లా పరిషత్‌ అద్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి సమావేశం నిర్వహించి గెలుపొందిన వారిని ప్రకటిస్తారు. చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక చేపట్టేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ముందుగా నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జెడ్పీలో ఇద్దరు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు.

అనంతరం చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌ ఎన్నికలు జరుపుతారు. ఇందుకు అటు మండల పరిషత్‌ కార్యాలయాల్లో, ఇటు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మండలాధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ ఒక్క రోజు, జెడ్పీచైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ల ఎన్నికలు ఒక్కో రోజులోనే పూర్తి కానున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలతో మొదలుకొని ఫలితం ప్రకటించేంత వరకు ప్రాసెస్‌ ప్రకారం ఒకేరోజులో ప్రక్రియ చేపడుతారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించిన ఆర్వోలే మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలకు ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయా అధ్యక్షుల ఎన్నికకు సంబంధించిన ఎస్‌ఈసీ ఇది వరకే షెడ్యూల్‌ కూడా జారీ చేసింది.

కోఆప్షన్‌ సభ్యుల నియమ నిబంధనలు

  •      మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి. 
  •      ఎంపీపీ పరిధిలో అయితే మండలంలో, జిల్లా పరిషత్‌లో అయితే జిల్లాలో ఎక్కడో ఒక చోట ఓటు హక్కు కలిగి ఉండాలి. 
  •      కోఆప్షన్‌ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి స్థానిక ఓటరై ఉండాలి. 
  •      వయసు 21 ఏళ్లకు తక్కువగా ఉండొద్దు 
  •      ఎంపీపీ, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికయ్యే వారికి ఇద్దరు పిల్లల నిబంధనను వర్తింపజేస్తున్నారు. 
  •      ఎంపీపీ, జెడ్పీ ఎన్నిక కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి వారిని ఆహ్వానిస్తారు.
  •      ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతి ద్వారా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. 

పరిషత్‌ కార్యాలయాల వద్ద 144 సెక్షన్‌.. 
శుక్ర, శనివారాల్లో మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుల, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని మండల పరిషత్‌ కార్యాలయాలతోపాటు జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. కార్యాలయాల నుంచి వంద మీటర్లలోపు ఈ సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరిషత్‌ కార్యాలయాలకు వెళ్లేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, సభ్యులకు, ఇతరులకు పాస్‌లు జారీ చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement