
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కొంత స్పష్టత వచ్చింది. బీసీలకు 30–31 శాతం, ఎస్సీలకు 13–14 శాతం, ఎస్టీలకు 4–5 శాతం మేయర్, చైర్మన్ స్థానాలు రిజర్వుకానున్నాయి. మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్/మేయర్ల స్థానాలను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం ఉదయం తన కార్యాలయంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ప్రకటించనున్నారు. దీంతో మున్సిపాలిటీలు యూనిట్‌గా, మున్సిపల్ కార్పొరేషన్లు యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్, మేయర్ స్థానాలకు సంబంధించిన కచ్చితమైన రిజర్వేషన్ల లెక్కలపై స్పష్టత రానుంది.
నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటినీ యూనిట్‌గా తీసుకుని చైర్మన్ స్థానాలకు, మున్సిపల్ కార్పొరేషన్‌లన్నింటినీ యూనిట్‌గా తీసుకుని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్/మేయర్ స్థానాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా, 16–18 స్థానాలు ఎస్సీలకు, 4–5 స్థానాలు ఎస్టీలకు, 37–39 స్థానాలు బీసీలకు, మిగిలిన స్థానాలు జనరల్‌కు రిజర్వు కానున్నాయి. అదే విధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనుండగా, ఎస్సీ లకు 1–2, ఎస్టీలకు 1, బీసీలకు 3–4 మేయర్ స్థానాలు రిజర్వయ్యే అవకాశాలున్నాయి.
వార్డులు/డివిజన్లవారీగా రిజర్వేషన్లు...
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న వార్డులు, డివిజన్ల సంఖ్యను ప్రకటిస్తూ శనివారం శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీని యూనిట్‌గా పరిగణించి స్థానిక వార్డుల రిజర్వేషన్లను, మున్సిపల్ కార్పొరేషన్‌ను యూనిట్‌గా తీసుకుని డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఒక్కో పురపాలికలో స్థానికంగా నివసించే ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీల్లో మొత్తం 2,727 వార్డులుండగా, ఎస్సీలకు 386, ఎస్టీలకు 159, బీసీలకు 802 వార్డులను కేటాయించారు. ఎన్నికలు జరుగనున్న 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 385 డివిజన్లుండగా, ఎస్సీలకు 49, ఎస్టీలకు 12, బీసీలకు 131 స్థానాలు వచ్చాయి.
చాలా పురపాలికల్లో ఎస్టీలు ఒకరిద్దరు మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి కనీసం ఒక వార్డు/డివిజన్‌ను కేటాయించారు. దీంతో ఎస్టీలకు సగటున 4.50 శాతం వరకు వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. అదే విధంగా సగటున బీసీలకు 31 శాతం, ఎస్సీలకు 14 శాతం వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు కానున్న వార్డులు/డివిజన్లను స్థానిక జిల్లా కలెక్టర్లు ఆదివారం ఉదయం డ్రా పద్దతిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, 22న పోలింగ్ జరుగనుంది. 25న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment