
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకు తొలి అడుగుగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 71 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలోని 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 36 మున్సిపాలిటీల్లో 136 గ్రామాలు విలీనమైన నేపథ్యంలో ఆయా చోట్ల డివిజన్లు/వార్డుల పునర్విభజన చేపట్టింది. మున్సిపాలిటీలను వార్డులుగా విభజించేందుకు స్థానిక ప్రజల నుంచి 7 రోజుల్లోగా సలహాలు, సూచనలు ఆహ్వానిస్తూ మునిసిపల్ కమిషనర్లు బహిరంగ ప్రకటన జారీ చేయనున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నుంచి సైతం సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు. వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి గురువారం ఈ కింద పేర్కొన్న మార్గదర్శకాలను జారీ చేశారు.
1 సమాన సంఖ్యలో ఓటర్లు,జనాభా ఉండేలా వార్డుల విభజనకు ప్రతిపాదనలు తయారు చేయాలి.
2 ఒక వార్డుకు, మరో వార్డుకు మధ్య ఓటర్ల సంఖ్యలో 10 శాతానికి మించి తేడా ఉండరాదు. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల పునర్విభజన జరపాలి.
3 ప్రస్తుత వార్డులు, కొత్తగా ప్రతిపాదిస్తున్న వార్డుల రూపురేఖలు కనిపించేలా వేర్వేరు రంగులతో మ్యాప్‌ను తయారు చేయాలి. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు తీసుకున్న చర్యలను పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు నివేదించాలి.
4 వార్డులకు నంబర్ల కేటాయింపును ఉత్తర దిక్కు నుంచి ప్రారంభించి వరుసగా తూర్పు, దక్షిణ, పడమర దిక్కుల క్రమంలో ముగించాలి. వార్డుల సరిహద్దులను నిర్ణయించే సమయంలో సహజ సిద్ధమైన సరిహద్దులకు ప్రాధాన్యతనివ్వాలి. సహజసిద్ధమైన సరిహద్దులు లేని చోట సర్వే నంబర్లు, ముఖ్యమైన జంక్షన్లను ప్రామాణికంగా తీసుకోవాలి.
5 వార్డుల విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి.
6 ముసాయిదా ప్రతిపాద నలపై ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుంది.
త్వరలో కులగణన...
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లలో భాగంగా వార్డుల పునర్విభజన ప్రక్రియ ముగిసిన వెంటనే పురపాలక శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో సర్వే జరపనుంది. ఈ సర్వే గణాంకాల ఆధారంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వర్గాల వారీకి రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో జారీ చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment