సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగిందని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారని తెలిపారు. పట్టణాల్లో పారిశుధ్య, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేశామని చెప్పారు.
రాబోయే కాలంలో పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వంతో సమన్వయం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు. సీఎం జగన్ ముందుచూపు వల్ల విశాఖపట్నాన్ని దేశంలోనే ఉన్నతస్థాయిలో నిలిపామని చెప్పారు. వరుస ఎన్నికల్లో చావుదెబ్బ తింటున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ అస్థిత్వం కోసం పోరాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలను కూడా రాష్ట్రంపై నెడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెబుతున్నప్పటికీ చంద్రబాబు తన వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోవడం లేదన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై ఆయన వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర ప్రజల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని, మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ఏం చేయాలో అన్నీ చేయటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఎవరెవరికో లేఖలు రాస్తున్నారని, రాయాల్సిన వారికి మాత్రం రాయటం లేదన్నారు.
ప్రజలంతా వైఎస్సార్‌సీపీ పక్షమే
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లా డుతూ.. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో ఆగిన దగ్గర నుంచి ప్రక్రియ తిరిగి ప్రారంభమైందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారని, అన్ని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, రెబల్స్ ఎవరూ ఉండరని చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు తథ్యమన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం తథ్యం
Published Wed, Feb 17 2021 3:35 AM | Last Updated on Wed, Feb 17 2021 6:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment