అమరావతి: తొలిదశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 82 శాతానికిపైగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తొలిదశలో జరిగిన ఎన్నికల్లో 2,637 పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలుపొందారని వివరించారు. తమ మద్దతుదారులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బుధవారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు.
చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పింది అంకెల గారడీనేనని పేర్కొన్నారు. కిందపడినా.. పైనే ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. కొన్ని దుష్టశక్తులు వాలంటీర్ వ్యవస్థకు తూట్లు పొడవాలని చూస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సేవా దృక్పథంతో పనిచేసే వారికి రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తామని ముందే చెప్పామని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినట్లు తెలిపారు. సమాజంలో వాలంటీర్లకు మంచి గౌరవం ఉందని దాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. ఎవరో చెప్పిన మాటల్ని విని.. పక్కదారి పట్టొద్దని వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment