తల్లాడలోని పోలింగ్ కేంద్రం వద్ద బారులు దీరిన ఓటర్లు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రెండో విడత పరిషత్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు జెడ్పీటీసీ, 82 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగంతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలు జరిగే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే స్పందించేందుకు రూట్ మొబైల్ పార్టీలను సిద్ధంగా ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఉదయం మందకొడిగా పోలింగ్ జరిగినప్పటికీ 11 గంటల తర్వాత ఊపందుకుంది.
మొదటి విడత ఎన్నికల్లో చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకోగా.. రెండో విడతలో మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. అయితే సత్తుపల్లి మండలం కిష్టారంలో మద్యం మత్తులో ఓ యువకుడు ట్రెయినీ ఎస్సై శ్రీకాంత్‌ను నెట్టివేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం రాత్రి స్వల్ప ఘర్షణ జరగడంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు తదితర ఏర్పాట్లు చేశారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, సీపీ..
రెండో విడత ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించారు. తల్లాడ జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంక సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అన్నారుగూడెంలో ఎన్నికల సరళిని సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పరిశీలించి.. శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అలాగే కిష్టారం పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, అసిస్టెంట్ కలెక్టర్ హనుమంతు కొడింబా పరిశీలించారు. పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.
మొత్తం 82.05 శాతం పోలింగ్ నమోదు..
రెండో విడత ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, సత్తుపల్లి, వేంసూరు జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 82.05 శాతం పోలింగ్ నమోదైంది. 1,88,785 ఓట్లు పోల్ కాగా..
అందులో 93,143 మంది పురుషులు, 95,642 మంది మహిళలు ఓట్లు వేశారు. అత్యధికంగా ఏన్కూరులో 85.31 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 22,207 ఓట్లు పోల్ కాగా.. 10,881 మంది పురుషులు, 11,326 మంది మహిళలు ఓట్లు వేశారు. అత్యల్పంగా కల్లూరులో 77.45 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 39,360 మంది ఓటు వేయగా.. అందులో 19,532 మంది పురుషులు, 19,828 మంది మహిళలు ఉన్నారు. పెనుబల్లిలో 84.61 శాతం పోలింగ్ నమోదు కాగా.. 34,418 మంది ఓటు వేశారు.
ఇందులో 17,003 మంది పురుషులు, 17,415 మంది మహిళలు ఉన్నారు. సత్తుపల్లిలో 83.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. 28,536 మంది ఓట్లు వేశారు. 13,784 మంది పురుషులు, 14,752 మంది మహిళలు ఓట్లు వేశారు. తల్లాడలో 83.46 శాతం పోలింగ్ జరగ్గా.. 36,564 మంది ఓట్లు వేశారు. 18,064 మంది పురుషులు, 18,500 మంది మహిళలు ఓట్లు వేశారు. వేంసూరులో 80.49 శాతం పోలింగ్ జరగ్గా.. మొత్తం 27,700 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 13,879 మంది పురుషులు, 13,821 మంది మహిళలు ఓట్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment