సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తుది విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం మూడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఈ నెల 14వ తేదీన మూడో విడతలో 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సమాయత్తమైంది. ఇప్పటికే ఒక ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైన విషయం విదితమే. మూడో విడత జరిగే ఎన్నికల్లో ప్రధానమైన జెడ్పీటీసీ స్థానాలు ఉండడంతో ముఖ్య పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహించాయి. టీఆర్‌ఎస్ తరఫున ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
చివరి రోజైన ఆదివారం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చింతకాని మండలం రామకృష్ణాపురం, లచ్చగూడెం, నాగులవంచ, కోమట్లగూడెం, నాగిలిగొండ, ప్రొద్దుటూరు, బోనకల్ మండలం లక్ష్మీపురం, గోవిందాపురం, రావినూతల తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఖమ్మం నియోజకవర్గంలోని
రఘునాథపాలెం మండలంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ విస్తృత ప్రచారం చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను గెలిపించాల్సిందిగా కోరారు. వైరా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మధిర నియోజకవర్గంలో ఆదివారం కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్‌పీ)నేత మల్లు భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రఘునాథపాలెం మండలంలో ఈ నెల 9వ తేదీన ఓట్లు అభ్యర్థించిన విషయం విదితమే. మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వివిధ మండలాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కీలక ప్రాదేశిక నియోజకవర్గాలు ఈ విడతలో ఉండడంతో ప్రధాన రాజకీయ పక్షాలు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
చిత్రవిచిత్రంగా పొత్తులు..
ఇక రాజకీయ పక్షాల పొత్తులు సైతం ఒక్కొక్క చోట చిత్ర విచిత్రంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల సీపీఎం, టీఆర్‌ఎస్, కొన్ని చోట్ల సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్, ఒక ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తుండటంతో ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనేక చోట్ల కలిసి పోటీ చేస్తున్నాయి. రఘునాథపాలెం మండలంలో టీఆర్‌ఎస్‌కి సీపీఐ, సీపీఎం మద్దతునివ్వగా, కాంగ్రెస్‌కి టీడీపీ మద్దతునిచ్చింది. బీజేపీ ఒంటరిగా బరిలో ఉండగా, మరికొద్ది మంది స్వతంత్రులుగా పోటీలో నిలిచారు. 7 జెడ్పీటీసీ స్థానాలకు 30మంది, 91 స్థానాలకు 259మంది బరిలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా బీజేపీ 18మంది, టీఆర్‌ఎస్ 85, కాంగ్రెస్ 65, సీపీఎం 18, టీడీపీ 11, సీపీఐ 14, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 5, స్వతంత్రులు 43మంది బరిలో ఉన్నారు.
ఓటర్లకు గాలం..
మూడో విడత ఎన్నికలకు ప్రచార పర్వం ముగియడంతో ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు పలు చోట్ల ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వా? నేనా ? అనే రీతిలో ఉన్న స్థానాల్లో ఓటర్లకు తాయిలాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో స్వల్ప ఓట్ల తేడానే గెలుపోటములను తేల్చనుండడంతో..ఓటర్లను ఆకట్టుకునేలా, తమకు ఓట్లు పడేలా అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment