సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతుల చిచ్చు ఆరడంలేదు. మంత్రి కె.తారకరామారావు ప్రతిరోజూ అసమ్మతి, అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ.. పార్టీ కోసం కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులపై అసంతృప్తి ఎక్కువగా ఉన్న నేతలు నియోజకవర్గాల వారీగా వచ్చి కేటీఆర్‌తో భేటీ అవుతున్నారు. కాగా, స్టేషన్ ఘన్‌పూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్యకు టీఆర్‌ఎస్ మళ్లీ అభ్యర్థిత్వం ఖరారు చేయడంపై అక్కడ నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని పలు మండలాల నేతలు బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ పరిస్థితితో మంత్రి కేటీఆర్ సూచన మేరకు కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి టి.రాజయ్యలతోపాటు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు వంద మంది వరకు సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కడియం శ్రీహరి, రాజయ్యలతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం అక్కడికి వచ్చిన నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ కలిసి పని చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులలో అభ్యర్థులను మార్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ‘సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు అని సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించిన ప్రకారం 105 సీట్లలో టిక్కెట్లు ఖరారు చేశాం. స్థానిక పరిస్థితుల కారణంగా 25 నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తి వ్యక్తమవుతోంది. అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు దగ్గరపడింది. అన్ని సర్దుకుంటున్నాయి. ఈ దశలో అభ్యర్థులలో మార్పులు జరగవు. ఏది ఏమైనా అభ్యర్థులను మార్చడం జరగదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెల వాల్సిన ఆవశ్యకత ఉంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలి. అసంతృప్త నేతల విజ్ఞప్తులను సావధానంగా వింటాం. కడియం శ్రీహరి, రాజయ్య కలిసి మీ విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. అందరూ కలిసి పని చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలి’అని కేటీఆర్ కోరారు.
టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యం: కడియం
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపే తమ లక్ష్యమని కడియం అన్నారు. టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కేటీఆర్, కడియం సూచనల అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ నేతలు అసంతృప్తితోనే అక్కడి నుంచి వెళ్లారు. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అసంతృప్త నేతలతోనూ కేటీఆర్ చర్చలు జరిపారు. పార్టీ కోసం పని చేయాలని సూచించారు.
నిర్మల్‌లో కుదిరిన సయోధ్య..
నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీహరిరావుల మధ్య సయోధ్య కుది రింది. వీరిద్దరు సోమవారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే మళ్లీ వస్తుందని, ప్రతి ఒక్కరికీ భవిష్యత్‌లో అవకాశాలు ఉంటా యని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో అసమ్మతికి తావులేదని, భేదాభిప్రాయాలను పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. నిర్మల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిని గెలిపించేందుకు అందరం కలిసి పనిచేస్తామని శ్రీహరిరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment