ఇఫ్తార్ విందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్ నల్గొండ : దేశవ్యాప్తంగా ముస్లింలు బీజేపీ పాలనలో అభద్రతతో జీవనం సాగిçస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని షాదీఖానాలో ఆయన ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. బీజేపీ అనుబంధ సంస్థలు ముస్లిం మైనార్టీల వేష, భాష, తినే తిండిపై కూడా ఆంక్షలు విధిస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు.
మోదీ పాలనలో ముస్లిం మైనార్టీలకు రక్షణ కరువైందని అన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రపతి ఎన్నికల నుంచి జీఎస్‌టీ బిల్లు వరకు టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలుకుతుందని అన్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయవద్దన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 100 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటివారు పనిచేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీలు మద్దతు పలకాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ముస్లింలకు రక్షణ ఉంటుందన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ సయ్యద్ గులాంబియాబానీ, రాష్ట్ర మైనార్టీ మాజీ కమిషనర్ అబ్దుల్ రసూల్ ఖాన్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సోహెల్‌బాయ్, మాజీ వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు జబ్బార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment