
వన్‌టౌన్ స్టేషన్ నుంచి వైఎస్పార్‌సీపీ నేతలను బయటకు తీసుకువస్తున్న పోలీసులు
హిందూపురం అర్బన్: టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నంద్యాల తరహా రాజకీయాలకు హిందూపురం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిందని వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సిద్దారెడ్డి, నదీంఅహ్మద్‌లు అన్నారు. ఆదివారం సాయంత్రం వారు హిందూపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసుశాఖ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం స్పార్క్ సంస్థ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, వైఎస్సార్‌సీపీ నాయకులు ముందుగా ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఇక్కడ గెలుస్తుందన్న భయంతోనే.. ఏవిధంగానైనా టీడీపీ పట్టు నిలుపుకునేందుకు స్వయంగా సీఎం కుమారుడు మంత్రి నారా లోకేష్, బావమరిది ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లామంత్రి పరిటాల సునీతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారన్నారు. సర్వే వ్యక్తుల వద్ద దొరికిన పేపర్లలో ఉన్న సమాచారంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల వ్యక్తిగత వివరాలు, ప్రలోభాలు చూపిన వివరాలు అన్నీ స్పష్టంగా ఉన్నా ఏమాత్రం చర్యలు లేవన్నారు. ఎవరైనా అభివృద్ధి చేసి ఓట్లు అడగడం పరిపాటనీ... అవేవీ చేయకుండా ప్రజలు ఓట్లు వేయడానికి సముఖంగా లేరని గ్రహించి ఆయా వార్డుల్లో ప్రభావితం చేసే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలు, బెదిరింపులతో లొంగదీసుకోవడానికి బాలకృష్ణ ఇలాంటి ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు.
సొంతింటిని చక్కదిద్దుకోండి
శాంతికి మారుపేరుగా నిలిచిన హిందూపురంలో భయానక వాతావరణం సృష్టించడం బాధకరమన్నారు. టీడీపీలో ఉన్న వారే అసంతృప్తితో ఉన్నారని, ముందు సొంతింట్లో పరిస్థితులు చక్కదిద్దుకోండని హితవు పలికారు. ఆ ప్రయత్నం చేయకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. స్పార్క్ సంస్థ వెనుకున్నవారిపై, సర్వేచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే చట్టం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. చట్ట వ్యతిరేకంగా సర్వే చేస్తున్న వారిని, సామగ్రిని అప్పగిస్తే కిడ్నాప్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నవీన్‌నిశ్చల్‌ను కేసులతో ఇబ్బందులు పెడితే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. పోలీసులు పక్షపాతం వీడి.. న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరారు. నవీన్‌నిశ్చల్‌పై అక్రమ కేసులు ఎత్తేయాలని, స్పార్క్ సంస్థపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
డబ్బుతో కొనొచ్చని పేపర్లలో స్పష్టీకరణ
బీసీ, మైనార్టీ, దళితులను డబ్బుతో కొనవచ్చని సర్వే కాగితాల్లో స్పష్టంగా రాసి ఉందన్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి ఈ కులాల వారికి ఏమీ చేయకుండా ఎన్నికలు దగ్గరపడుతున్నాయని కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటనారాయణను కలిసి మాట్లాడారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాలచంద్రారెడ్డి, మండల కన్వీనర్ నారాయణస్వామి, జగన్‌మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజనీ, మహిళా మండల కన్వీనర్ నాగమణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పోలీసుల హైడ్రామా
హిందూపురం అర్బన్: వైఎస్సార్‌సీపీ నాయకులు ఫజుల్‌రెహమాన్, మల్లికార్జున, ఇర్షాద్, టైలర్ జబీ, షేక్షాలను శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి వరకు కోర్టులో హాజరుపర్చకుండా వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా నాయకులు అరెస్టయిన వారిని కలవడానికి పోలీసుస్టేషన్‌కు బయల్దేరారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటనారాయణ, సీఐలు హైడ్రామాకు తెరలేపారు. ఒక్కసారిగా పోలీసుస్టేషన్‌లో సిబ్బందిని అప్రమత్తం చేసి అదుపులోకి తీసుకున్న ఐదుగురిని వాహనంలో బలవంతంగా ఎక్కించి మరోచోటికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని విలేకరులు ఫొటోలు తీçస్తుండగా అడ్డుకున్నారు. అరెస్టయినవారిని వాహనంలో తీసుకుని బయటకు వస్తుండగా వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుల వాహనం వారి ముందుకు వచ్చింది. దీంతో పోలీసులు తమ వాహనాన్ని వేగంగా ఆస్పత్రికి వైపునకు తీసుకెళ్లారు. విలేకరులు పసిగడతారని ఆస్పత్రిలోని చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఉంచారు. మీడియా వస్తుండటంతో వాహనాన్ని తిరిగి టూటౌన్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందును అడుగగా తనకేమీ సంబంధం లేదని, కేసు టూటౌన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. టూటౌన్ సీఐ తమీంఅహ్మద్‌ను విలేకరులు ప్రశ్నించగా సాయంత్రమే అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హాజరుపరుస్తాం అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment