ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా పాయకరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ అసమ్మతి వర్గం నాయకులు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: అసమ్మతి నేతలు గళం విప్పారు.అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతామని అధినేత వద్ద కుండబద్ధలుకొట్టారు. పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు ఈసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ టికెట్ల పంచాయతీ గురువారం అమరావతిలో వాడీవేడిగా జరిగినట్టు తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. రాత్రి విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సమన్వయ కమిటీల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా సిటింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులతో విడివిడిగా మాట్లాడారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత కనీసం వివాదాలకు తావులేని నియోజకవర్గాల వరకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. విశాఖ తూర్పునకు వెలగపూడి రామకృష్ణ, విశాఖ పశ్చిమకు పీజేవీఆర్ నాయుడు (గణబాబు), విశాఖ దక్షిణానికి వాసుపల్లి గణేష్‌కుమార్, పెందుర్తికి బండారు సత్యనారాయణమూర్తి, గాజువాకకు పల్లా శ్రీనివాసరావు, నర్సీపట్నానికి అయ్యన్నపాత్రుడు, అరకుకు కిడారి శ్రావణ్‌కుమార్, పాడేరుకు గిడ్డి ఈశ్వరి తొలివిడతలో టికెట్లు ఖరారయ్యాయని చెబుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే అరకుకు కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. అనకాపల్లి ఎంపీ కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ కోసం పట్టుబట్టినట్టు తెలిసింది. విశాఖకు గంటా శ్రీనివాసరావు, ఎం.శ్రీభరత్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమన్వయ కమిటీ నేతలు చెబుతున్నారు.
అనితపై ఎగసిన అసమ్మతి : పాయరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అసమ్మతి సెగ అమరావతికి తగిలింది. సమన్వయ కమిటీ భేటీలోనే అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలంతా గళం విప్పారు. ఎమ్మెల్యే అనినీతి తారస్థాయికి చేరుకుందని, మళ్లీ ఆమెకు టికెట్ ఇస్తే ఘోరంగా ఓటమి పాలవడం ఖాయమని సమన్వయ కమిటీ భేటీలో నేతలు పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిత– అసమ్మతి నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుందని తెలిసింది. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటూ అసమ్మతి నేతలు ఫిర్యాదుచేశారు. వారు చెప్పేవన్ని అబద్ధాలేనని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఈసారి మళ్లీ గెలుస్తానంటూ అనిత చెప్పుకొచ్చారు.
కాపులకు ఇవ్వండి : చోడవరం నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు కాపులేనని, ఈసారైనా అసెంబ్లీ సీటును కాపులకు ఇవ్వాలని చోడవరం కాపు నేతలు డిమాండ్ చేశారు. చోడవరం సమన్వయ కమిటీ భేటీలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుకు ఈసారి టికెట్ ఇవ్వొద్దని, పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారని, ఈసారి కాపులకు ఇచ్చి తీరాలని వారు పట్టుబట్టారు. మాడుగులలో కూడా ఇదే రీతిలో పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామా నాయుడుకు వ్యతిరేకంగా పలువురు గళమెత్తినట్టు తెలిసింది.
భరత్‌కు ఎంపీ టికెట్ ఇవ్వండి
విశాఖ ఎంపీ టికెట్ భరత్‌కుమార్‌కు ఇవ్వాలని మెజార్టీ ఎమ్మెల్యేలు అధినేతకు సూచించినట్టు తెలిసింది. తన పేరు గట్టిగా చెప్పాలని కోరుతూ బుధవారం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.40 లక్షలు ఎర చూపిన భరత్ ఒకరిద్దరికి ఇప్పటికే ఇవ్వగా.. మిగిలిన వారికి గురువారం ఉదయం సమావేశం ప్రారంభానికి ముందే అందజేసినట్టు తెలిసింది. దీంతో మెజార్టీ ఎమ్మెల్యేలు భరత్‌కుమార్ పేరునే ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. అయితే మంత్రి గంటా పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment