
లోకేష్‌ని ప్రశ్నిస్తే యామిని ఎందుకు స్పందిస్తోంది...
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు నారాలోకేష్, మంత్రి దేవినేని ఉమాలపై ఫైర్ అయ్యారు. దేవినేని ఉమాకు సిగ్గుందా? ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం ఎందుకు ఆపలేకపోయారు? నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి... తాబేదార్లతో తాళాలు మోగించారు. టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా దిగజారి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. డేటా చోరీ చేసి, టీడీపీ సేవామిత్ర యాప్‌లకు ఇచ్చింది వాస్తవమా కాదా?. ఆధార్ సమాచారం అంతా ఐటీ గ్రిడ్స్ పేరుతో దొంగిలించిన మాట నిజమా కాదా?.
సెలెక్టెడ్ ఆర్టిస్ట్‌లతో టీడీపీ ఆఫీసులో ఇష్టానురీతిగా మాట్లాడిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ అశోక్, లోకేష్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అని ప్రశ్నిస్తే ఎదురుదాడులా?. అశోక్‌ని ఎక్కడ దాచారు?.. సిట్ ఏమైంది?.. సిట్ రిపోర్ట్ ఏదీ?.. డేటా స్కాంలో దొంగలెవరు?. చంద్రబాబు.. ఈ విషయంలో నువ్వూ, లోకేశ్ ఎందుకు నోరువిప్పడం లేదు. లోకేష్‌ని ప్రశ్నిస్తే యామిని ఎందుకు స్పందిస్తోంది. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోండి. 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్క ముక్కలో చెప్పగలరా?. టీడీపీకి దిమ్మదిరిగే సమాధానం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అడ్డగోలుగా దోచుకుని, ఇప్పుడు నీతులా. మీ చేతకానితనాన్ని ఇప్పుడు ఈవీఎంలపై నెడుతున్నారా?. చంద్రబాబుకి మతిమరుపు వచ్చింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఎలా గెలిచారు?. చంద్రబాబు ఓటమి ఫ్రస్టేషన్లో ఉన్నార’’ని అన్నారు.