సాక్షి, అమరావతి బ్యూరో: ప్రవీణ్ తొగాడియా... పరిచయం అక్కర్లేని పేరు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హిందూ అతివాదిగా ముద్రపడ్డ ప్రవీణ్ తొగాడియాలో మరో కోణం ఉంది. ఆయన దేశంలోనే పేరుమోసిన కేన్సర్ వైద్య నిపుణుడు. బీజేపీ పాలిత రాజస్థాన్ పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేశా రు. ఒకనాటి ఆత్మీయ మిత్రుడు మోదీతో భిన్నాభిప్రాయాలే తప్ప సైద్ధాంతిక విభేదాలు లేవన్నారు. ఎన్‌కౌంటర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. విజయవాడకు వచ్చిన తొగాడియా శుక్రవారం ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు.
సాక్షి: ప్రధానిగా మారిన తరువాత మోదీతో విభేదాలు తలెత్తాయనిపిస్తోంది!
తొగాడియా: ప్రధానితో విభేదాలున్నా యని చెప్పానా? నాతో విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారా? లేదే... భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. మేము ఇప్పటికీ స్నేహితులం.
సాక్షి: రాజస్థాన్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు..?
తొగాడియా: ఆ అంశంపై నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను.
సాక్షి: అసలు మిమ్మల్ని ఎందుకు ఎన్‌కౌంటర్ చేస్తారని భావిస్తున్నారు?
తొగాడియా: ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెబుతాను.
సాక్షి: మీరు చేసిన ఆరోపణలపై సంఘ పరివార్ వర్గాలు స్పందించినట్లు లేదు కదా!
తొగాడియా: రాజస్తాన్ హోంమంత్రి స్పందిం చారు. నాకు రాజస్తాన్, గుజరాత్ ప్రభుత్వాలపై నమ్మకం ఉంది. రాజస్థాన్ పోలీసులు ఇంకా అహ్మదాబాద్‌లో మకాం వేసి ఈ కేసు విచారణ పేరుతో ఏదో చేస్తున్నారు. అంటే ఏదో జరుగుతోందనుకుంటున్నా.
సాక్షి: మోదీ ప్రభుత్వ పనితీరుకు మీరు ఏ రేటింగ్ ఇస్తారు?
తొగాడియా: నేను రేటింగ్ ఏజెన్సీని కాదు. హిందుత్వ వాదిని, వైద్యుడిని.
సాక్షి: మోదీ ప్రభుత్వ పనితీరుపై తొగాడియా సంతృప్తిస్థాయి ఏమిటో దేశం తెలుసుకోవాలి అనుకుంటే ఏం చెబుతారు?
తొగాడియా: అందుకు ఐదు విధానాలు సమర్థంగా అమలు చేయాలని చెబుతాను.
1. దేశంలో ఏటా కోటికిపైగా కుటుంబాలు ఊహించని వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ప్రతి ప్రైవేట్ వైద్యుడు రోజుకు ఒకరికి ఉచితంగా వైద్యం అందిస్తే వారందరికీ ప్రయోజనం కలుగుతుంది.
2. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిని రేషన్, బ్యాంకు రుణాలకు, ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేయాలి.
3. జీడీపీ పెరుగుతోంది కానీ ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. జీడీపీ 1 శాతం పెరిగితే కోటికి పైగా ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక విధానాలు రూపొందించాలి.
4. గిట్టుబాటు ధరల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధరగా నిర్ణయించాలి.
5. అయోధ్యలో రామమందిరం నిర్మించాలి. కాశ్మీరీ హిందువులు తమ స్వస్థలాల్లో స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉండాలి.
సాక్షి: ఈ అంశాల్లో ప్రధాని మోదీకి సలహా ఇవ్వొచ్చు కదా?
తొగాడియా: ప్రధానికి ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా.
సాక్షి: పదివేలకు పైగా క్యాన్సర్ సర్జరీలు చేసిన బిజీ డాక్టర్‌గా ఉంటూ వీహెచ్‌పీకి సమయం ఎలా కేటాయించగలిగారు?
తొగాడియా: సర్జరీకి సర్జరీకి మధ్య కొంత సమయం తీసుకొని వీహెచ్‌పీ కార్యకలాపాలు చూసేవాడిని. ప్రస్తుతం సర్జరీలు చేయ డం లేదు. ఓపీ సేవలు కొనసాగిస్తున్నా.
మోదీతో విభేదాల్లేవు.. భిన్నాభిప్రాయాలే
Published Sat, Jan 27 2018 1:31 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment