togadia
-
మోదీతో విభేదాల్లేవు.. భిన్నాభిప్రాయాలే
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రవీణ్ తొగాడియా... పరిచయం అక్కర్లేని పేరు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హిందూ అతివాదిగా ముద్రపడ్డ ప్రవీణ్ తొగాడియాలో మరో కోణం ఉంది. ఆయన దేశంలోనే పేరుమోసిన కేన్సర్ వైద్య నిపుణుడు. బీజేపీ పాలిత రాజస్థాన్ పోలీసులు తనను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేశా రు. ఒకనాటి ఆత్మీయ మిత్రుడు మోదీతో భిన్నాభిప్రాయాలే తప్ప సైద్ధాంతిక విభేదాలు లేవన్నారు. ఎన్కౌంటర్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు. విజయవాడకు వచ్చిన తొగాడియా శుక్రవారం ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. సాక్షి: ప్రధానిగా మారిన తరువాత మోదీతో విభేదాలు తలెత్తాయనిపిస్తోంది! తొగాడియా: ప్రధానితో విభేదాలున్నా యని చెప్పానా? నాతో విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారా? లేదే... భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. మేము ఇప్పటికీ స్నేహితులం. సాక్షి: రాజస్థాన్ పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు..? తొగాడియా: ఆ అంశంపై నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. సాక్షి: అసలు మిమ్మల్ని ఎందుకు ఎన్కౌంటర్ చేస్తారని భావిస్తున్నారు? తొగాడియా: ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెబుతాను. సాక్షి: మీరు చేసిన ఆరోపణలపై సంఘ పరివార్ వర్గాలు స్పందించినట్లు లేదు కదా! తొగాడియా: రాజస్తాన్ హోంమంత్రి స్పందిం చారు. నాకు రాజస్తాన్, గుజరాత్ ప్రభుత్వాలపై నమ్మకం ఉంది. రాజస్థాన్ పోలీసులు ఇంకా అహ్మదాబాద్‌లో మకాం వేసి ఈ కేసు విచారణ పేరుతో ఏదో చేస్తున్నారు. అంటే ఏదో జరుగుతోందనుకుంటున్నా. సాక్షి: మోదీ ప్రభుత్వ పనితీరుకు మీరు ఏ రేటింగ్ ఇస్తారు? తొగాడియా: నేను రేటింగ్ ఏజెన్సీని కాదు. హిందుత్వ వాదిని, వైద్యుడిని. సాక్షి: మోదీ ప్రభుత్వ పనితీరుపై తొగాడియా సంతృప్తిస్థాయి ఏమిటో దేశం తెలుసుకోవాలి అనుకుంటే ఏం చెబుతారు? తొగాడియా: అందుకు ఐదు విధానాలు సమర్థంగా అమలు చేయాలని చెబుతాను. 1. దేశంలో ఏటా కోటికిపైగా కుటుంబాలు ఊహించని వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ప్రతి ప్రైవేట్ వైద్యుడు రోజుకు ఒకరికి ఉచితంగా వైద్యం అందిస్తే వారందరికీ ప్రయోజనం కలుగుతుంది. 2. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిని రేషన్, బ్యాంకు రుణాలకు, ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేయాలి. 3. జీడీపీ పెరుగుతోంది కానీ ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. జీడీపీ 1 శాతం పెరిగితే కోటికి పైగా ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక విధానాలు రూపొందించాలి. 4. గిట్టుబాటు ధరల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. సాగు వ్యయానికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధరగా నిర్ణయించాలి. 5. అయోధ్యలో రామమందిరం నిర్మించాలి. కాశ్మీరీ హిందువులు తమ స్వస్థలాల్లో స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఉండాలి. సాక్షి: ఈ అంశాల్లో ప్రధాని మోదీకి సలహా ఇవ్వొచ్చు కదా? తొగాడియా: ప్రధానికి ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సాక్షి: పదివేలకు పైగా క్యాన్సర్ సర్జరీలు చేసిన బిజీ డాక్టర్‌గా ఉంటూ వీహెచ్‌పీకి సమయం ఎలా కేటాయించగలిగారు? తొగాడియా: సర్జరీకి సర్జరీకి మధ్య కొంత సమయం తీసుకొని వీహెచ్‌పీ కార్యకలాపాలు చూసేవాడిని. ప్రస్తుతం సర్జరీలు చేయ డం లేదు. ఓపీ సేవలు కొనసాగిస్తున్నా. -
వారి.. కాల్ రికార్డులు బయట పెట్టండి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ, గుజరాత్ జాయింట్ కమిషనర్ జేకే భట్ల కాల్ రికార్డులను బయట పెట్టాలని ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. కాల్ రికార్డులు వెలుగులోకి వస్తే మరిన్ని వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఆయన అన్నారు. విశ్వహిందూ పరిషత్‌లోని కొన్ని వర్గాలు ఇదిలావుండగా.. తొగాడియా విషయాన్నిరెండుమూడు రకాలుగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తొగాడియా ఇష్యూను కొందరు వీహెచ్‌పీ నాయకులు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు. మరికొందరు ఈ విషయంపై రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. వీహెచ్‌పీలో ఒక వర్గం మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంది. ఈ నెల 26ప అలహాబాద్‌లో జరగనున్న మార్గదర్శక్ మండల్, సంత్‌ల సమావేశంలో ప్రవీణ్ తొగాడియా విషయాన్ని చర్చించవద్దని మరో వర్గం తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పాల్గొంటున్న తొగాడియా కూడా.. ఈ విషయంపై మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
వీహెచ్‌పీ యాత్ర కు బ్రేక్
అయోధ్య/న్యూఢిల్లీ/లక్నో: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివాదాస్పద అయోధ్య యాత్రకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం బ్రేక్ వేసింది. వీహెచ్‌పీ అగ్రనేతలు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 1,700 మందిని అరెస్టు చేసింది. వీహెచ్‌పీ సరయూ ఘాట్ నుంచి అయోధ్య వరకు ‘చౌరాసీ కోసీ పరిక్రమ యాత్ర’ పేరుతో 252 కి.మీ.(84 కోసులు) యాత్రను ప్రారంభించాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ యాత్ర మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందంటూ యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం అరెస్టులు, ఉద్రిక్తత మధ్యనే వీహెచ్‌పీ ఈ యాత్రను అయోధ్యలో ప్రారంభించింది. దీంతో అయోధ్యలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఒక్క ఫైజాబాద్ జిల్లాలోనే 625 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుతామని శాంతి భద్రతల ఐజీ ఆర్కే విశ్వకర్మ తెలిపారు. భారీ భద్రత, అరెస్టులపై నిరసన.. ఆరు నూరైనా యాత్ర చేసి తీరతామని వీహెచ్‌పీ స్పష్టం చేయడంతో ఆదివారం యూపీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. యాత్ర కోసం అయోధ్య చేరుకున్న తొగాడియాను గోలాఘాట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకున్న సింఘాల్‌ను అక్కడి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సింఘాల్ అయోధ్యకు వెళ్తానని పట్టుబట్టడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టుపై సింఘాల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూపీలో మొఘల్ పాలన సాగుతోందని మండిపడ్డారు. యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు అయోధ్యకు చేరుకోనున్నారని, నిషేధంపై పునరాలోచించుకోవాలని రాష్ట్ర సర్కారును డిమాండ్ చేశారు. సింఘాల్ అరెస్టుకు నిరసనగా విమానాశ్రయం వెలుపల బీజీపీ, వీహెచ్‌పీ కార్యకర్తలు ధర్నా చేశారు. అణచివేతకు నిరసనగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తొగాడియా చెప్పారు. ‘ఇది రాజకీయ యాత్ర కాదు, మత యాత్ర. దీనిపై నిషేధాన్ని సహించే ప్రసక్తే లేదు’ అని విలేకర్లతో అన్నారు. మరోపక్క.. రామజన్మభూమి ట్రస్టుకు చెందిన నృత్య గోపాల్ దాస్ అయోధ్యలోని తమ ఆలయంలో పదడుగులు వేసి యాత్రను ప్రారంభించారు. తర్వాత పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, యాత్ర కన్వీనర్ స్వామి చిన్మయానందను షాజహాన్పూర్లోగృహనిర్బంధంలో ఉంచారు. అరెస్టయిన వారి కోసం ప్రభుత్వం పలు ప్రాంతాల్లో తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసింది. కాగా, అరెస్టులపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పార్టీ నేత వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో ఆరోపించారు. వీహెచ్‌పీ రాష్ట్రంలో అశాంతి రేపడానికి యాత్ర చేపట్టిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. యాత్రపై నిషేధంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చెప్పింది. యాత్ర రాజకీయ ప్రేరే పితం... అయోధ్య ప్రధాన పూజారి: వీహెచ్‌పీ యాత్రకు సొంతవారినుంచే ఊహించని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ యాత్ర రాజకీయ ప్రేరేపితమని, సాధువులను స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అయోధ్యలోని తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సతేంద్ర దాస్ విమర్శించారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా వీహెచ్‌పీ యాత్ర ముహూర్తాన్ని నిర్ణయించిందన్నారు. శ్రీరాముడు కూడా ఈ సమయంలో (ఆగస్టు-డిసెంబర్) సీతాన్వేషణ యాత్రను వాయిదా వేసుకున్నారని ఉదహరించారు. వీహెచ్‌పీ యాత్రకు మత ప్రాధాన్యం లేదని, రామాలయ నిర్మాణం కోసం ప్రజల దగ్గరకు వెళ్లడమే దాని ఉద్దేశమని అన్నారు. సింఘాల్ ఇటీవల ములాయంను కలుసుకున్నారని, ఆ భేటీ వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదని దాస్ ఆరోపించారు. దాస్ వాదనతో పలువురు పూజారులు ఏకీభవించడం గమనార్హం.