
చౌడేపల్లెలో జనసేన కార్యకర్తల నుంచి స్వాధీనం చేసుకున్న టోకెన్లు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్ గెలుపొందేందుకు ఓటర్లకు ఎర వేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు చొప్పున ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లను ఓటర్లకు ఇచ్చి ఒక సెంటర్ పేరు చెబుతున్నారు. అక్కడికి ఈ టోకెన్లను తీసుకుని వెళితే రూ.2 వేల చొప్పున ఇచ్చేలా జనసేన పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇలా టోకెన్లను పంపిణీ చేస్తున్న 12 మంది జనసేన కార్యకర్తలను పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ఆదివారం పట్టుకుని ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పుంగనూరు సమీపంలోని క్రిష్ణమరెడ్డిపల్లె, బోడినాయినిపల్లె పరిసరాల్లో 8 మంది జనసేన కార్యకర్తలు ముద్రించిన రూ.2 వేలు టోకెన్లను ఓటర్లకు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు శ్రీనివాసరావు, టీమ్ ఆఫీసర్ శివకుమార్ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షలు విలువ జేసే 600 టోకెన్లను, రూ.46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చౌడేపల్లెలో టోకెన్లు పంపిణీ చేస్తుండగా నలుగురు యువకులను పట్టుకుని 1,600 టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు.
సింగిరిగుంట చెక్‌పోస్ట్ వద్ద మహేంద్ర స్కార్పియోలో 5,000 టోకెన్లను డ్రైవర్ సీటు క్రింద దాచినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.92 లక్షలుగా గుర్తించారు. మొత్తం మీద పుంగనూరు, చౌడేపల్లిలో రూ.1.02 కోట్ల విలువజేసే టోకెన్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరులో నాలుగు కేసులు, చౌడేపల్లెలో రెండు కేసులను జనసేన పార్టీపై నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment