చింతమనేని నిశ్చింత , ప్రత్తి‘పాట్లు’ పుల్లారావు , జవహర్ర్..ర్ర్..
ఏలూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుధీర్ఘంగా ప్రసంగిస్తున్న సమయంలో ఆ పార్టీ నేతలు సొమ్మసిల్లారు. కొందరు సెలవెప్పుడో అన్నట్టు సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయగా.. మరికొందరు నారావారి వాగ్ధాటికి కొద్దిసేపు కునుకు తీశారు.
ఏలూరు (మెట్రో): లోటు బడ్జెట్ భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, రావాల్సిన నిధులను ఇప్పటికీ విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏలూరు పవర్‌పేటలో నిర్మించిన ఎన్జీఓ హోమ్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 14 శాతం వృద్ధి రేటు సాధనకు ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు. అతి తక్కువ సమయంలో రెండంకెల స్థాయి వృద్ధి రేటును సాధించి దేశంలోనే రాష్ట్రం చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పోరాట పటిమ మరవలేనిదని, అదే స్పూర్తితో రాష్ట్రంలో వృద్ధి రేటు 14 శాతం సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజన్‌కు అనుగునంగా ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పడూ సానుకూల దృక్పథంతోనే వ్యవహరిస్తోందని, విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక లోటుతో ఉన్నా.. ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని చెప్పుకొచ్చారు. నిరంతరాయ విద్యుత్‌తోపాటు, వంటగ్యాస్‌ను పూర్తిస్థాయిలో అందించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎన్జీఓ భవన నిర్మాణం పూర్తికి రూ. 42 లక్షలు మంజూరు చేశారు.
దాతలకు ముఖ్యమంత్రి సన్మానం
రాష్ట్ర ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి సహకారం అందిస్తున్నారన్నారు. హోం నిర్మాణానికి నిధులు అందించి సహకరించిన రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సత్తి పద్మనాభమూర్తి, బొల్లిన నాగకిశోర్, రామకృష్ణారావు, మైలవరపు రమేష్, కందుల సత్యనారాయణ, పి.శ్రీనివాసరాజు, అంబికా కృష్ణ, తన్నీరు యోగానంద్‌ను ముఖ్యమంత్రి సన్మానించారు.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, చింతమనేని ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, గన్ని వీరాంజనేయులు, ముప్పిడి వెంకటేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, పీతల సుజాత , ఎమ్మెల్సీలు షరీఫ్ పాందువ్వ శ్రీను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రాంజీ, రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ, కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, ఎన్జీఓ సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఎన్‌జీవో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్, హరనాథ్ పాల్గొన్నారు.
సభలో సాగర్ హడావుడి
ఎన్జీఓ హోమ్ ప్రారంభ సభ ముగింపులో గతంలో ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షునిగా విధులు నిర్వహించిన ఎల్.విద్యాసాగర్ హడావుడి చేశారు. తానే ఎన్జీఓ భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నానని, కలెక్టర్ తనపై కక్షపూరితంగా వ్యవహరించి తన ఉద్యోగాన్ని తొలగించేశారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment