సీఎం వస్తున్నారు సెలవులిచ్చేయండి | Schools Holiday When Chandrababu Naidu Tours In Districts | Sakshi
Sakshi News home page

సీఎం వస్తున్నారు సెలవులిచ్చేయండి

Published Tue, Jul 3 2018 9:17 AM | Last Updated on Sat, Sep 15 2018 5:49 PM

Schools Holiday When Chandrababu Naidu Tours In Districts - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తుంటే ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులకు పండుగగా మారుతోంది. జన సమీకరణ కోసం స్కూల్‌ బస్సులన్నింటినీ తెలుగుదేశం నేతలు, అధికారులు బలవంతంగా తీసుకుంటుండటంతో వారికి సెలవు ప్రకటించడం ఆనవాయితీగా మారుతోంది. తాజాగా జిల్లా కేంద్రమైన ఏలూరులో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తుండటంతో మరోసారి ఏలూరు కార్పొరేషన్, రూరల్, దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో స్కూళ్లకుసెలవు ప్రకటించారు. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో డీఈఓ ఆదేశాల మేరకు సెలవు ప్రకటిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి.

సొసైటీలపై భారం
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతవసంతాల సందర్భంగా ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులతో ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం భారీగా రైతులను సమీకరించాలని నిర్ణయించారు. జిల్లాలో మూడు సెంటర్లలో బ్యాంక్‌ చైర్మన్‌ సమావేశాలు నిర్వహించి, ఆయా సొసైటీ బాధ్యులు, బ్యాంకు బ్రాంచిలకు జనసమీకరణ బాధ్యత అప్పగించారు. దీనిలో భాగంగా ప్రైవేటు స్కూల్‌ బస్సులతో పాటు  170 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏ సొసైటీ నుంచి ఎన్ని బస్సుల్లో రైతులను సమీకరించి పంపితే ఆ సొసైటీపై అంత భారం పడనుంది. ఎన్ని బస్సులు పెడితే అన్ని బస్సులకు సంబంధించిన ఖర్చును ఆయా సొసైటీలే భరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

ఒక్కో బస్సు కోసం 18 నుంచి 21 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని, బ్యాంకు శతవసంతాల కార్యక్రమం కోసం తాము ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని ఆయా సొసైటీల అధ్యక్షులు ప్రశ్నిస్తున్నారు. తాము తమ సొంత వాహనాలలో వస్తామని చెప్పినా తాము బస్సులు బుక్‌  చేసేశామని మీరు అందులోనే రావాలని చెబుతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం సీటు నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ ముత్యా ల రత్నం తన బల ప్రదర్శనకు బ్యాంకు వందేళ్ల పండుగను వాడుకుంటున్నారని సొసైటీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. ప్ర జలు దాచుకున్న సొమ్ములను ఉత్సవాల పేరుతో భారీగా ఖర్చు చేయడం కూడా విమర్శలకు దారితీస్తోంది. సుమారు 15 వేల మందికి భోజనాల ఏర్పాటుతో పాటు ఈ ఏడాది ఉత్సవాల కోసం కోటి రూపాయల వరకూ ఖర్చు చేయాలని నిర్ణయించడం వివాదానికి దారితీస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement