సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కక్ష పూరిత రాజకీయాలు..మొత్తం రాజకీయ వ్యవస్థనే నాశనం చేస్తున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతాయని ఊహించలేదన్నారు. మన్మోహన్ సింగ్ చెప్పినట్టు ఉన్న ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు, వార్షిక బడ్జెట్ కు 6 నెలలలో 36 వేల కోట్ల బడ్జెట్ తగ్గిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు.
16 రూపాయలు కూడా ఇవ్వలేదు..
లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందో.. కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. యువత ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. కనీసం 16 రూపాయలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర్రలో మరాఠాలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టు..తెలంగాణలో కూడా 50 శాతం బీసీలు ఉన్నారు కాబట్టి 50 శాతం పైగా రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు,మైనార్టీలకు ఇస్తామని స్పష్టం చేశారు.
మేధావులు కాంగ్రెస్‌లోకి చేరాలి...
తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రెస్‌లోకి చేరాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.17న పది గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు.17న జరగబోయే పీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఏఐసీసీలో జరిగిన అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేకుండా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 2న గాంధీజీ 150 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరపనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment