మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కేవీపీ
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని, ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ దుర్వినియోగం చేసిం దని.. మద్యం, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసి అధికారులను అడ్డం పెట్టుకుని తామేదో అద్భుత విజయం సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటోం దని విమర్శించారు. ఇందుకు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పరాకాష్ట అని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎంపీ కేవీపీ రామచందర్‌రావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్కతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యంపై అధికార పార్టీ అత్యాచారం చేసిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం వ్యవహారంతో ఎన్నికల వ్యవస్థే కలుషితమైందన్నారు.
తెలంగాణ సమాజాన్ని, ప్రజలను అవమానపర్చేలా మున్సిపల్ ఎన్నికల ప్రహసనం కొనసాగిందని, కేటీఆర్ వ్యవహార శైలి చాలా బాధాకరమన్నారు. ఇలా ఎన్నికలు నిర్వహించే కంటే కేసీఆర్, కేటీఆర్ ఫాంహౌస్‌లోనో, ప్రగతిభవన్‌లోనో కూర్చుని ఎవరు ఎన్నిక కావాలో రాసుకుంటే సరిపోయేదన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్‌లా జరగలేదని, కాంగ్రెస్ వర్సెస్ డబ్బు, మద్యం, పోలీస్, అధికారులు అన్నట్లు జరిగాయన్నారు. ఇతరులు గెలిచిన చోట్ల ఎక్స్‌అఫీషియో సభ్యులను పెట్టి గెలుపొందడం ద్వారా వికృతానందం పొందడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో కేటీఆర్ గంట గంటకు అధికారులతో మాట్లాడి ఏం చేయాలో ఆదేశాలు జారీ చేశారని, ఈ విషయాన్ని అధికారులే తమకు స్వయంగా చెప్పారన్నారు.
నేరేడుచర్లలో ఏం జరిగిందంటే...
ఈనెల 25 రాత్రిలోపు ఎక్స్‌అఫీషియో సభ్యులను నమోదు చేసుకోవాలని సీడీఎంఏ శ్రీదేవి చెప్పా రని చెప్పారు. ఆ రోజు తాను, కేవీపీతో పాటు టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే సైదిరెడ్డి మాత్రమే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నామని చెప్పారు. తెల్లారేసరికి కేవీపీ ఓటు తీసేసి, టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ లింగయ్య, ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు ఓట్లు నమోదు చేశారని చెప్పారు. తర్వాత కేవీపీ పేరు చేరుస్తున్నట్లు ప్రకటించారని, 27న ఎన్నిక జరగకుండా వాయిదా వేయించారని చెప్పారు. 28న టీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి పేరు ఎక్స్‌అఫీషియో ఓటరుగా నమోదు చేసి ఎన్నిక నిర్వహించారన్నారు. ఇదేమంటే పైనుంచి తమకు ఆదేశాలున్నాయని చెప్పారన్నారు. తన ఓటు గురించి 80 ఏళ్ల వయసులో ఎంపీ కేకే మాట్లాడడం సరిగా లేదన్నారు. నేరేడుచర్ల ఎన్నిక గురించి మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా 10 సార్లు నాగిరెడ్డికి, సీడీఎంఏకు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు.
లోక్‌సభలో మాట్లాడతా...
రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గి పోతోందని ఉత్తమ్ అన్నారు. రిజర్వేషన్లు వచ్చిన తర్వాత నామినేషన్లకు గడువివ్వాలని తాను కోర్టుకు వెళితే ఆ కేసును విచారించిన జడ్జి కూడా ఏకీభవించారని, తానే ఎస్సీని అయితే నామినేషన్ ఎలా వేస్తానని అధికారులను ప్రశ్నించారని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఏకవాక్యంతో తన పిటిషన్‌ను రాత్రి 7 గంటలకు డిస్మిస్ చేశారని, 8 గంటలకు ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. తనకు చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నా బయట మాట్లాడలేకపోతున్నానని, కోర్టుల్లో ఏం జరుగుతుందన్న దానిపై తాను లోక్‌సభలో ప్రస్తావిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు కేటాయించిన రాష్ట్రాలు మార్చాలంటూ ఎంపీలు కేవీపీ, కేకే దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ ఆ దరఖాస్తును రాజ్యసభ సెక్రటేరియెట్ తిరస్కరించిందని చెప్పారు.
నా ఓటు ఎవరి దయాదాక్షిణ్యం కాదు: కేవీపీ
తాను నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, అది తన హక్కు అని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు వ్యాఖ్యానించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి తాను రాజ్య సభకు ఎన్నికయ్యాయని, తాను ఇక్క డే స్థిర నివాసం ఉంటున్నాననే ఆలోచనతో నోడల్ జిల్లాగా హైదరాబాద్‌ను ఎంచుకున్నానని చెప్పారు. తెలంగాణ వచ్చాక 5 సార్లు హైదరాబాద్‌లోనే ఓటు హక్కు వినియోగించుకున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment