సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీలో కోవర్టులున్నారా..? వారి మూలంగానే పార్టీ నష్టపోతోందా? పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేసే కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నారా...? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు గాంధీభవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్‌లో ఇంటిదొంగలున్నారని, వారెవరో త్వరలోనే చెబుతామంటూ ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు సీనియర్లు ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించడంతో.. అసలు కోవర్టులెవరనే దానిపై చర్చ మొదలైంది. అయితే, కోవర్టులు ఎవరనే విషయంలో స్పష్టత రానప్పటికీ వారి మూలంగానే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని టీపీసీసీ నేతలు గుర్తించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా గోడ దూకిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు గతంలో మరో నలుగురు పార్టీ మారేందుకు వీరే కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక్కడ ఉంటూనే...!
గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీలో కోవర్టుల వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ కోవర్టులు టీపీసీసీకి చెందిన వారు కాదని, వేరే రాష్ట్రానికి చెందిన వారనే చర్చ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. టీపీసీసీలో కూడా ఒకరిద్దరు ఉన్నప్పటికీ వారు నేరుగా పార్టీకి నష్టం చేసేంత శక్తి కలిగిన నేతలు కారని, పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నాయకుడే తెలంగాణ కాంగ్రెస్‌కు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు టీపీసీసీలోని కొందరు సహకరిస్తున్నారని చెబుతున్నారు. అయితే, ఆయనతో పాటు మరికొందరు టీపీసీసీ నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని కొందరు అంటున్నారు.
ఏదైనా కీలక అంశానికి సంబంధించిన టీపీసీసీ నిర్ణయం తీసుకున్న క్షణాల్లోనే ఆ సమాచారం ప్రత్యర్థి శిబిరానికి వెళ్తోందని, పార్టీ నిర్ణయాలను గులాబీ గూటికి మోసే కొందరిని గుర్తించారని కూడా అంటున్నారు. ‘పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు కీలక నిర్ణయాలను ఇతర పార్టీలకు చేరవేసేలా కొందరు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీనిపై పార్టీ కూడా ఆరా తీస్తోంది. ఈ విషయంలో ఎవరైనా ఆధారాలతో దొరికితే మాత్రం పార్టీ పరంగా కచ్చితంగా చర్యలుంటాయి.’అని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
టికెట్లు ఇప్పించడంలోనూ...
కాంగ్రెస్ కోవర్టులు పార్టీ నిర్ణయాలను మార్చగలిగే స్థాయికి చేరుకున్నారని, గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీని కూడా ప్రభావితం చేసి చివరి నిమిషంలో టికె ట్లు మార్పించారనే చర్చ జరుగుతోంది. పారాచూట్లకు టికెట్లు లేవని ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు రావడంలో, పార్టీలో చాలా కాలంగా పనిచేస్తూ పార్టీకి అండగా ఉన్నవారికి టికెట్లు రాకుండా చేయడంలో వీరు కీలకపాత్ర పోషించారనే వాదన వినిపిస్తోంది. పార్టీ లో ఎమ్మెల్యేల మార్పునకు సహకరించిన, పార్టీ నిర్ణయాలను ఇతరులకు చేరవేస్తున్న నేతలెవరు? వారి పేర్లు బయటపడతాయా? టీపీసీసీ గుర్తించి చర్యలు తీసుకుంటుందా? కోవర్టుల కథ కొనసాగుతూనే ఉంటుందా? ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment