ఉత్తమ్‌ వారసుడెవరో? | TPCC Uttam Kumar Reddy Wants Resign Chief Post After Municipal Elections | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌ వారసుడెవరో?

Published Thu, Jan 2 2020 2:58 AM | Last Updated on Thu, Jan 2 2020 2:58 AM

TPCC Uttam Kumar Reddy Wants Resign Chief Post After Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవి వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలకు, నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకుగాను తాను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి మున్సిపల్‌ ఎన్నికల తర్వాత తప్పుకుంటానని ప్రస్తుత చీఫ్‌ ఉత్తమ్‌ స్వయంగా వెల్లడించడంతో ఆయన వారసుడు ఎవరనే దానిపై కాంగ్రెస్‌ కేడర్‌లో విస్తృత చర్చ జరుగుతోంది.

వాస్తవానికి, గత ఏడాది కాలంగా టీపీసీసీ అధ్యక్షుని మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతున్నా, స్వయంగా ఉత్తమ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ‘బాస్‌’ఎవరనేది ఆసక్తి కలిగిస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబుల పేర్లు రేసులో ముందు వరుసలో వినిపిస్తుండగా, టీపీసీసీ ముఖ్య నేతలు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

జాబితా పెద్దదే 
రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు టీపీసీసీలోని చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం వినిపిస్తున్న వారి పేర్లలో రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దల్లోని అందరూ ఉన్నారు. అయితే, మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని త్యజించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం ఇస్తారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఆయన కూడా బహిరంగంగా తాను పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని పలుమార్లు చెప్పగా, గులాంనబీ ఆజాద్‌ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మద్దతుదారులు గాంధీభవన్‌లో ఆందోళన కూడా నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా రేసులో అందరికంటే ముందున్నారు. యువకుడు కావడంతో పాటు రాష్ట్రంలో మంచి క్రేజ్‌ ఉన్న నేతగా ఆయనకు అవకాశం ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది.

అయితే, రేవంత్‌ అభ్యర్థిత్వానికి అధిష్టానం నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా కొందరు స్థానిక నేతలు అడ్డు తగులుతున్నారని సమాచారం. ఇక, సౌమ్యుడిగా ముద్ర పడిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కూడా టీపీసీసీ రేసులో ముందు వరుసలోనే ఉన్నారు. శ్రీధర్‌బాబుకు అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర పార్టీలోని కొందరు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు మద్దతుగా ఇద్దరు కీలక నేతలు లేఖలు కూడా ఇచ్చారని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరితో పాటు పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

బీసీ సామాజిక వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఒక్కతాటిపైకి వచ్చి ఈసారి తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ వేదికగా ఇటీవల సంయుక్తంగా సమావేశం కూడా పెట్టుకున్నారు. వీటన్నింటి నేపథ్యంలో కాబోయే టీపీసీసీ చీఫ్‌ ఎవరు.. అధిష్టానం ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తుంది.. సామాజిక అంశాల ను బేరీజు వేసుకుంటుందా..? చరి ష్మా ఆధారంగా పదవి కట్టబెడు తుందా..? అన్నది కాం గ్రెస్‌ శ్రేణుల్లో ఆసక్తి కలిగిస్తోంది.

ఏఐసీసీ ప్రక్షాళన తర్వాతే!
టీపీసీసీ అధ్యక్ష పదవిపై ప్రస్తుతానికి ఏఐసీసీ దృష్టి పెట్టకపోయినా గతంలో ప్రాథమికంగా కొంత కసరత్తును పూర్తి చేసింది. ఏఐసీసీ కసరత్తుతో పాటు టీపీసీసీ నేతలు పలువురు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కూడా తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏఐసీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులను కూడా దేశవ్యాప్తంగా మార్పు చేస్తారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇన్‌చార్జి కుంతియా స్థానంలో కొత్త నేత వచ్చే అవకాశముందని, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్త నాయకుడు వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలోనే టీపీసీసీ అధ్యక్ష ఎంపిక కసరత్తు పూర్తిస్థాయిలో జరుగుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే మార్చి లేదా ఏప్రిల్‌ వరకు టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కొనసాగనున్నారు. మరి కొత్త ఇన్‌చార్జి రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త బాస్‌ ఎంపిక కసరత్తు పూర్తి చేస్తారా? ఉత్తమ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఈలోపే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా? అన్నది వేచి చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement