సాక్షి, విజయవాడ : టీడీపీ అంటే ‘తెలుగు దోపిడి పార్టీ’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అభివర్ణించారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ నేటి నుంచి ఐదు రోజులపాటు రిలే నిరహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో లక్షలాది కుటుంబాలు రోడ్డన పడ్డయని, అగ్రిగోల్డ్ ఆస్తులను కొనడానికి వచ్చిన ఎన్‌ఎల్ గ్రూపును ప్రభుత్వం వెనక్కి పంపిందని ఆరోపించారు. 2019లో ఏపీలో ప్రభుత్వం మారబోతుందని ఆయన జోస్యం చెప్పారు.
వచ్చే ప్రభుత్వంలో బీజేపీ కీలకపాత్ర పోషిస్తుందని.. గతంలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించింది చంద్రబాబేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గోబెల్స్‌కు గురువు లాంటి వాడని, గత ఎన్నికల్లో బీజేపీ లేకుంటే టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నాలుగో స్థానంలో ఉందని, టీడీపీ-కాంగ్రెస్ నాణానికి చెరోకోణం వంటివని వర్ణించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిపురా ఫార్మాలాను అనుసరిస్తామని రాం మాధవ్ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రల తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment