‘ఆది’లో అసమ్మతి ! | TRS Activists Angry On Party Leaders | Sakshi
Sakshi News home page

‘ఆది’లో అసమ్మతి !

Published Wed, Apr 11 2018 11:15 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

TRS Activists Angry On Party Leaders - Sakshi

సాక్షి, కొత్తగూడెం: గత ఎన్నికల ముందు జిల్లాలో నామమాత్రంగా ఉన్న టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చాక ఇబ్బడి ముబ్బడి వలసలతో ప్రస్తుతం కిటకిటలాడుతోంది. అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యే స్థాయి నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే గత ఎన్నికల ముందు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రంఅంతంతమాత్రమే. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు అసలు కేడర్‌ అనేదే లేదు. ఇల్లెందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో మాత్రం కొంతమంది టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భవించిన 2001 నుంచి పని చేసిన కార్యకర్తలు రాష్ట్రం సాధించేవరకు అనేక ఇబ్బందులు పడుతూ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించారు.

నామినేటెడ్‌ పోస్టుల్లో మొండిచెయ్యే...
తీరా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తమకు గుర్తింపు లేకుండా పోయిందని నాటి కార్యకర్తలు  ఆవేదన చెందుతున్నారు. వివిధ నామినేటెడ్‌ పోస్టులతో పాటు, పార్టీ పదవులు సైతం తమకు దక్కలేదని వాపోతున్నారు. ప్రాధాన్యం ఇవ్వకపోతారా అని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా  ఫలితం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సొంత పనులు వదులుకుని ఉద్యమంలో తిరిగామని, చివరకు పార్టీలో ఏమాత్రం విలువ లేదని ఆవేదన చెందుతున్నారు. పార్టీ తమను గుర్తించడంలేదని ఇప్పటివరకు సన్నిహితుల వద్ద వాపోయిన ఉద్యమకారులు ప్రస్తుతం బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల పాటు  ఉద్యమంలో పనిచేసినా, ఇప్పుడు ఆదరణ లేదని ఆవేదన చెందుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో సుమారు 150 మంది చొప్పున, పినపాక నియోజకవర్గంలో మరో 100 మంది కార్యకర్తలు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. తీరా ఇప్పుడు తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.

త్యాగాలు తప్పవని కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ, ఇన్నేళ్లూ ఉద్యమంలో పనిచేసిన తామే ఇలాగే ఉంటే బయటి నుంచి వచ్చినవారు అధికారం అనుభవించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.    పినపాక నియోజకవర్గంలో బూర్గంపాడుకు చెందిన పొడియం నరేందర్‌కుమార్, మణుగూరుకు చెందిన ఎడ్ల శ్రీనివాస్‌ తదితరులు టీఆర్‌ఎస్‌ జెండా మోస్తూ నిరంతరం ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరకు పొడియం నరేందర్‌కుమార్‌ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ను సైతం త్యాగం చేశారు. కానీ వారికి ప్రస్తుతం పార్టీ పదవుల్లోనూ న్యాయం జరగలేదు. ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చిరు వ్యాపారులు, రోజువారీ పనులు చేసుకునే వారు సైతం ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని పాల్వంచలో తాజాగా సోమవారం కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఏకంగా మున్సిపాలిటీ కార్యాలయం ఎదుటే ఆందోళన చేశారు. 17 నెలలుగా మున్సిపాలిటీలో తాత్కాలిక కార్మికులుగా పనిచేస్తే వేతనాలు ఇవ్వకపోగా తమను తొలగించారని, టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నా ఇలా చేయడమేంటని గగ్గోలు పెట్టారు. ఉగ్గగాని శేఖర్‌ అనే కార్యకర్త పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకుని సెల్‌ టవర్‌ ఎక్కడం గమనార్హం. 

తెలంగాణ జనసమితిలోకి తాళ్లూరి, గోపగాని
గతంలో ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన తాళ్లూరి వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంలోనే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఉద్యమంలో ఉండడంతో పాటు ఇటీవలి వరకు పార్టీలోనే కొనసాగారు. చివరకు ఇక్కడ ప్రాధాన్యత కరువైందని భావించి మరో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత గోపగాని శంకర్రావుతో కలిసి కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితిలో ఆవిర్భావం రోజే చేరారు. మరికొంతమంది సైతం ఇదే బాట పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement