నెక్ట్స్‌ ఏంటి?  | TRS Assembly Tickets Aspirant leaders was Shocked | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ ఏంటి? 

Published Sat, Sep 8 2018 2:54 AM | Last Updated on Sat, Sep 8 2018 5:38 PM

TRS Assembly Tickets Aspirant leaders was Shocked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో కొందరు ఆశావహులు షాక్‌కు గురయ్యారు. టికెట్లు ఖరారైన అభ్యర్థులు ఉత్సాహంతో రంగంలోకి దిగుతుండగా, టికెట్‌ వస్తుందనే విశ్వాసంతో ఉన్న వారు, ఆశించిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు పార్టీ జాబితాపై టీఆర్‌ఎస్‌ ముఖ్యుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లను చివరిక్షణం వరకు ప్రకటించకుండా ఉంటే అయో మయం, గందరగోళం, ఒత్తిళ్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. టికెట్‌ తమకే వస్తుందని ఎవరికివారే ప్రచారం చేసుకోవడం, పార్టీ శ్రేణుల్లో చీలికలు, గ్రూపులు, వైషమ్యాలు పెరిగిపోతాయని వాదిస్తున్నారు.

ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వల్ల అంతర్గత అంశాలను సరిచేసుకోవడానికి, గెలుపు కోసం పోరాటంపైనే దృష్టి కేంద్రీకరించడానికి సాధ్యం అవుతుందని అంటున్నారు. అయితే , పార్టీ శ్రేణుల అభిప్రాయాలను, క్షేత్రస్థాయి అంశాలను చర్చించకుండా ఒకేసారి టికెట్లను ప్రకటించడం వల్ల నేతలు మరోదారి చూసుకునే అవకాశం ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన నాయకులు మాత్రం కార్యరంగంలోకి దూకారు. వనరులను సిద్ధం చేసుకుంటూ, క్షేత్రస్థాయి పరిస్థితులను చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టారు. 

అసంతృప్తిలో పలువురు నేతలు 
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి వివిధ స్థాయిల్లో పని చేస్తున్న నాయకులు టికెట్లపై ఆశలు పెంచుకున్నారు. కొందరు సిట్టింగులను మార్చి తమకే టికెట్లు వస్తాయనే విశ్వాసంతో పార్టీ ముఖ్యులు, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి, అప్పటి నుంచి పార్టీలో పని చేస్తున్నా అవకాశం రాని నేతలు అసంతృప్తితో ఉన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే, స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారికి టికెట్‌ను ప్రకటించడంతో ఆ నియోజకవర్గం నుంచి టికెట్‌  ఆశించిన గండ్ర సత్యనారాయణరావు తిరుగుబాటు గళమెత్తారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టి.రాజయ్యను ప్రకటించడంతో రాజారపు ప్రతాప్‌ రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యకు ఇదే నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డోర్నకల్‌ నుంచి సత్యవతీ రాథోడ్, మహబూబాబాద్‌ నుంచి మాలోతు కవిత టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో వెంకటేశ్వర్‌రావు తన సత్తాను చూపిస్తానని ప్రకటించారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన దుబ్బాక నర్సింహారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. సంగారెడ్డి నుంచి టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అలిగినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రత్యామ్నాయాలపై అన్వేషణ 
టీఆర్‌ఎస్‌లో టికెట్లు ఆశించి, భంగపాటుకు గురైన నాయకులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో టీఆర్‌ఎస్‌ నుంచి తలుపులు మూసుకుపోవడంతో అందుబాటులో ఉన్న అవకాశాలేమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తమ అనుచరులు, సన్నిహితులతో చర్చిస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుందనే దానిపై మాట్లాడుకుంటున్నారు. టికెట్లు రాకున్నా, ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ నుంచి అవకాశాలు రాకుంటే స్వతంత్రంగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement