నాలుగేళ్లాయె పదవులు రావాయె..! | TRS Cadre Awaits For Nominated Posts | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లాయె పదవులు రావాయె..!

Published Fri, Feb 23 2018 1:48 AM | Last Updated on Fri, Feb 23 2018 1:48 AM

TRS Cadre Awaits For Nominated Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయాయి. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయినా ఇప్పటికీ పదవులు అందకపోవడంతో చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తితో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. నియోజకవర్గాలకు వెళదామంటే భయంగా ఉందని ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. పదవుల కోసం నిలదీస్తున్నారని, ముఖం చాటేస్తున్నారని పేర్కొంటున్నారు.

చైర్మన్లను నియమించినా..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటిదాకా కార్పొరేషన్లు, కమిషన్లు, ఇతర సంస్థలు కలిపి 56 మందికి చైర్మన్‌ పదవులను కట్టబెట్టింది. అందులో 49 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో ఏడుగురి నుంచి 15 మంది వరకు డైరెక్టర్లను నియమించుకునేందుకు ప్రభుత్వానికి అధికారముంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ముఖ్యులైన ద్వితీయ శ్రేణి నేతలతో కూడిన జాబితాను కూడా పార్టీ అధినేతకు అందజేశారు. కానీ ఇప్పటివరకు డైరెక్టర్లు, సభ్యుల నియామకం జరగలేదు.

కొన్ని కార్పొరేషన్లకు మూడేళ్లు, మరికొన్నింటికి రెండేళ్ల పదవీకాలంతో చైర్మన్ల నియామకాలు జరిపింది. కొందరి పదవీకాలం కూడా ముగియవస్తోంది. అసలు అధికారంలోకి రాగానే 2014, 2015లో నియమించిన ఎస్సీ కార్పొరేషన్‌ వంటి వాటికి రెండోసారి చైర్మన్‌ పదవిని పొడిగించినా.. డైరెక్టర్ల నియామకం చేపట్టలేదు. అయితే గత సంక్రాంతికి నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఉంటుందన్న వార్తలతో.. ఏడాదైనా పదవిలో ఉంటామని నేతలు ఆశపడ్డారు.

కానీ అదేమీ లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా నియోజకవర్గంలో ముఖ్యులైన నలుగురికి పదవులు కావాలని.. ఏదో ఒక కార్పోరేషన్‌లో డైరెక్టర్‌గా నియమించాలని సిఫారసు చేసి రెండేళ్లయింది. ఇదిలో అదిగో అని చెప్పుకుంటూ వచ్చా. ఇప్పుడు నేను నియోజకవర్గానికి వెడితే వాళ్లు కనిపించడం లేదు. ముఖ్యమైన మీటింగ్‌లకు కూడా రావడం లేదు..’’అని ఓ సీనియర్‌ ఎమ్మెల్యే వాపోయారు.
 
నాలుగేళ్లుగా ఎదురుచూపులే..
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేడర్‌ పదవుల కోసం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తునే ఉన్నాయి. ఇదిగో.. అదిగో.. అంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఊరడించడమే తప్ప ఆచరణలోకి రాలేదు. ఓ లెక్కప్రకారం దాదాపు 500దాకా నామినేటెడ్‌ పోస్టులు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలుగురికిపైగా అవకాశం వస్తుంది.

అయితే.. ‘‘రెండేళ్ల కిందే నామినేటెడ్‌ పదవుల కోసం నా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని 40 మందికి పదవులు కావాలని సిఫారసు చేశా. ఇప్పుడు నాకు నియోజకవర్గానికి వెళ్లాలంటేనే భయంగా ఉంది..’’అని లోక్‌సభ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. అయితే కొందరికి పదవులు వస్తే మిగతావారు వ్యతిరేకిస్తారన్న వాదన ఉందని, దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
 
అసంతృప్తి వ్యతిరేకతగా మారే ప్రమాదం!
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నియామకమైన కొన్ని కార్పోరేషన్లకు రెండోసారి పదవికాలాన్ని పొడిగించారు. మరికొన్నింటికి మూడేళ్లు దగ్గరపడుతున్నాయి. ఇంకొన్ని ఏడాదిన్నర, రెండేళ్లు పూర్తిచేసుకున్నాయి. కానీ వాటికి చైర్మన్లను తప్ప సభ్యులను, డైరెక్టర్లను నియమించలేదు. ‘‘టీఆర్‌ఎస్‌కు అధికారం వచ్చి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే నాకే అధికారం వచ్చినంత సంబురపడ్డా. అధికారంలోకి రాకముందు పడ్డ కష్టమంతా మర్చిపోయిన. రోజులు గడుస్తున్న కొద్దీ నిరాశ నిండింది. ఇప్పుడైతే ఏదైనా దొరుకుతుందన్న ఆశ కూడా చచ్చిపోయింది.

చైర్మన్లతోపాటే సభ్యులను, డైరెక్టర్లను కూడా నియమిస్తే.. నేతలు, కార్యకర్తలకు బాధ ఉండేది కాదు. చిన్నదో, పెద్దదో పదవి వచ్చిందనే సంతృప్తి ఉండేది..’’అని పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేసిన సీనియర్‌ కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలోని కొన్ని కార్పోరేషన్లలో కనీసం ఆరుగురి నుంచి 15 మందిదాకా డైరెక్టర్లను, సభ్యులను నియమించే అవకాశముంది. ఆ లెక్కన ఇప్పటివరకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్లు, ఇతర సంస్థల్లో కలిపి సుమారు 500 మందికిపైగా నాయకులకు అవకాశం దక్కేదని పార్టీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

మరో సీనియర్‌ నాయకుడు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘రాజకీయాల్లో ఉన్నవారికి ఏదో ఒక పదవి రావాలని కోరిక ఉండటం సహజం. అవకాశమున్నా పదవులను భర్తీ చేయలేదు. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఇబ్బందులకోర్చి పనిచేసినవారికి అసంతృప్తి పెరుగుతోంది. ఇది వ్యతిరేకతగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు..’’అని అసంతృప్తి వెలిబుచ్చారు.
 
పదవులున్నా.. పనేదీ?
రాష్ట్రస్థాయి కార్పోరేషన్లకు చైర్మన్లుగా నియామకమైన వారిలోనూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవులు దక్కినా చేయడానికి పనేమీ లేదని నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రభుత్వం నుంచి జీతభత్యాలు రావడం తప్ప నేను చేస్తున్నదేమీ లేదు. పదవిలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప ఉద్యమ సహచరులకు, ప్రజలకు ఏదైనా చేస్తున్నాననే సంతృప్తి లేదు..’’అని ఓ కార్పోరేషన్‌ చైర్మన్‌ వ్యాఖ్యానించారు.

అసలు కొందరు చైర్మన్ల నియామకం జరిగి ఏడాది పూర్తికావస్తున్నా చాంబర్లు కూడా కేటాయించలేదు. పనిచేసే అవకాశం లేని పదవి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటనే కారణంతో కొందరు చైర్మన్లు చాంబర్లలోకి వెళ్లడానికి కూడా అయిష్టంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement