ఇద్దరు సిట్టింగులకు మొండిచేయి | TRS chief kcr finalizing the election campaign | Sakshi
Sakshi News home page

ఇద్దరు సిట్టింగులకు మొండిచేయి

Published Sun, Sep 30 2018 2:04 AM | Last Updated on Sun, Sep 30 2018 2:14 PM

TRS chief kcr finalizing the election campaign - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల ప్రచార పర్వాన్ని ఖరారు చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పెండింగ్‌లో ఉన్న 14 స్థానాల అభ్యర్థులపైనా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌ 3 నుంచి వరుసగా నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌(వనపర్తి), వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని స్థాయిల్లోని టీఆర్‌ఎస్‌ నేతలను, శ్రేణులను ఎన్నికల ప్రచారంలో నిమగ్నం చేయడం, అభ్యర్థులను పరిచయం చేస్తూ మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరడం ప్రధాన ఉద్దేశంగా ఈ సభలను నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాల బహిరంగసభలు కావడంతో వీటి నిర్వహణకు ముందే.. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించనున్నారు. సోమవారం లేదా మంగళవారం టీఆర్‌ఎస్‌ రెండో జాబితా వెల్లడించే అవకాశం ఉందని పార్టీ అధిష్టాన వర్గాలు తెలిపాయి. గెలుపు ప్రాతిపదికగా సామాజిక వర్గాలను పరిశీలించడంతోపాటు ప్రతిపక్షాల కూటమి తరఫున అభ్యర్థులు ఎవరుంటారనే అంచనాలతో పెండింగ్‌ జాబితాను ఖరారు చేశారు.

రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 105 స్థానాలకు సెప్టెంబర్‌ 6న ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న 90 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలలో 83 మందికి మళ్లీ అవకాశం ఇచ్చారు. నల్లాల ఓదెలు(చెన్నూరు), బాబూమోహన్‌(అంథోల్‌)కు మాత్రం టికెట్లు నిరాకరించారు. కొండా సురేఖ(వరంగల్‌ తూర్పు), బొడిగె శోభ(చొప్పదండి), ఎం.సుధీర్‌రెడ్డి(మేడ్చల్‌), కనకారెడ్డి(మల్కాజ్‌గిరి), బి.సంజీవరావు(వికారాబాద్‌) అభ్యర్థిత్వాలను పెండింగ్‌లో పెట్టారు.

ఈ స్థానాలతోపాటు మరో 9 సెగ్మెంట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తొలి జాబితా అనంతరం కొండా సురేఖ టీఆర్‌ఎస్‌ అధిష్టానంపై విమర్శలు చేసి కాం గ్రెస్‌లో చేరారు. దీంతో మరో నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల భవితవ్యం తేలాల్సి ఉండగా.. మేడ్చల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలకు టికెట్‌ నిరాకరించినట్లేనని టీఆర్‌ఎస్‌ అధిష్టాన వర్గాలు తెలిపాయి.

మేడ్చల్‌లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని లోక్‌సభ సభ్యుడు మల్లారెడ్డికి, మల్కాజ్‌గిరిలో ప్రచారం చేసుకోవాలని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు పార్టీ అధిష్టానం సూచించింది. చొప్పదండి విషయంలోనూ ఇదే నిర్ణయం జరగనుందని తెలిసింది. పెండింగ్‌లో పెట్టిన 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా.. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా సర్వేల తో సమాచారం సేకరిస్తున్నారు. జాబితా ప్రకటించే రోజుకు వీటిలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డికి మేడ్చల్‌ సీటు ఖరారు చేసినప్పటికీ, తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్‌ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజ్‌గిరి టికెట్‌ ఖరారైంది. తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి తన కోడలు విజయశాంతికి టికెటివ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
గోషామహల్‌ టికెట్‌ను దానం నాగేందర్‌కు ఓకే చేసి, ప్రచారం చేసుకోవాలని రెండు వారాల క్రితమే సూచించింది. నాగేందర్‌ మాత్రం తనకు ఖైరతాబాద్‌ సీటు ఇవ్వాలని కోరుతున్నారు.
ఖైరతాబాద్‌ టికెట్‌ను పీజేఆర్‌ కూతురు విజయారెడ్డికి ఇస్తూ టీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ తరపున ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేగా ఉండేవారు. వీరిలో నలుగురికే తాజాగా మళ్లీ అభ్యర్థిత్వాలు ఇచ్చారు.
ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముఠా గోపాల్‌ ను ఖరారు చేయగా, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి కోసం హోంమంత్రి నాయిని ప్రయత్నిస్తున్నారు.
అంబర్‌పేట టికెట్‌ను కాలేరు వెంకటేశ్‌కు ఇవ్వగా, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గడ్డం సాయికిరణ్‌ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు.
చొప్పదండిలో టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ అభ్యర్థిగా ఖరారయ్యారు. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు జహీరాబాద్‌ స్థానం ఖరారైంది. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మానిక్‌రావు ఇంకా యత్నాలు చేస్తున్నారు.
వికారాబాద్‌ స్థానాన్ని కొత్త అభ్యర్థికి ఇవ్వాలని నిర్ణయించింది. టి.విజయ్‌కుమార్, ఎస్‌.ఆనంద్‌లో ఒకరిని తుది జాబితాలో ప్రకటించనుంది. తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు యత్నాలు కొనసాగిస్తున్నారు.
వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్‌ వరంగల్‌æ మేయర్‌ నన్నపునేని నరేందర్, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక నాయకుడు గుడిమల్ల రవికుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి పేర్లను పరిశీలిస్తోంది. బీసీ వర్గానికి చెందిన
అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో నల్లగొండ లోక్‌సభ సభ్యుడు సుఖేందర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, శానంపూడి సైదిరెడ్డిలలో ఒకరిని ఎంపిక చేయనున్నారు. సుఖేందర్‌రెడ్డివైపే టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొగ్గు చూపిస్తోంది.
మహాకూటమిపై స్పష్టత వచ్చాక కోదాడ అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ లోని ఒక నాయకుడిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వేనేపల్లి చందర్‌రావులో ఒకరిని తుది జాబితాలో చేర్చనున్నారు.
చార్మినార్, మలక్‌పేటలో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలు ముఖీద్‌చంద్, చవ్వా సతీష్, అజంఅలీలో ఇద్దరిని టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement