కుషాయిగూడ: తాము అధిష్టానానికి వ్యతిరేకం కాదని..అభ్యర్థికి మాత్రమేనని ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఉప్పల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం హెచ్‌బీకాలనీ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు గొల్లూరి అంజయ్య, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, స్వర్ణరాజ్, మేకల అనళా హన్మంతరెడ్డి, గోపు సరస్వతీ సదానంద్, గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు, ఆయా డివిజన్ పార్టీల బాధ్యులు మాట్లాడారు. ఉప్పల్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బేతి సుభాష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఒంటెద్దు పోకడలు పోతూ పార్టీ కార్యకర్తలను, నాయకులను అయోమయానికి గురిచేస్తున్నాడని ఆరోపించారు.
డివిజన్‌లలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రచారం సాగించడం, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షుల ఇంటి ఎదుట బాణాసంచా పేల్చుతూ, హేళన చేస్తూ..తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరైంది కాదని హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగిస్తున్న బేతి సుభాష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చాలని వారు డిమాండ్ చేశారు. మా మనోవేదనను కేసీఆర్, కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లి ఉప్పల్‌లో గులాబీజెండాను ఎగురవేస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ డివిజన్ పార్టీల అధ్యక్షులు పులిచేరాలు, వంజరి ప్రవీణ్, విద్యాసాగర్, మురళీ పంతులు, రేపాక కుమారస్వామి, చేర్యాల శ్రీనివాస్, ఎల్లగోని ప్రకాశ్, రాపోలు సతీష్‌తో పాటుగా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment