విస్తరణకు నోచుకోని ఉప్పల్ రహదారి
‘మహానగర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం.అభివృద్ధి అంతా ఒకేవైపు కేంద్రీకృతం కాకుండా వెస్ట్ హైదరాబాద్‌కు(శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్) దీటుగా ఈస్ట్ హైదరాబాద్(ఉప్పల్,మల్కాజిగిరి, ఎల్బీనగర్)లో అభివృద్ధిపరుగులు పెట్టిస్తాం’ –2016 మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్
నిజమే..కేటీఆర్ హామీ మేరకు మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈస్ట్ హైదరాబాద్ నుంచేజీహెచ్‌ఎంసీకి మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఎన్నికయ్యారు. కేటీఆర్ హామీ మేరకు మేయర్ చొరవతో ఈ జోన్ పరిధిలో పలు రహదారులు, చెరువుల పనులైతే ప్రారంభమయ్యాయి.అయితే ఈ పనుల పూర్తికి నిర్దేశించిన గడువు ఎప్పుడో ముగిసింది. కానీ పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కనీసం ఈ పనులు సమీక్షలకు సైతం నోచుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, జీహెచ్‌ఎంసీ మేయర్ మధ్య కోల్డ్ వార్ ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరానికి తూర్పు ద్వారంగా, ఓరుగల్లు, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు లైఫ్‌లైన్‌గా మారిన ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది జనానికి పరీక్ష పెడుతోంది. వీరి కోల్డ్‌వార్ కారణంగా ఇక్కడ కొత్త పనులు ప్రారంభం కాకపోగా, ప్రారంభించిన పనులు నత్తకే నడకలు నేర్పుతున్నాయి. పనుల పురోగతి, సమీక్షలకు ఇద్దరి నేతల మధ్య ప్రోటోకాల్ అంశం పెద్ద గుదిబండగా మారింది. ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రామ్మోహన్ శాసనస¿భలో అడుగు పెట్టడమే లక్ష్యంగా తొలుత పనిచేశారు. నియోజకవర్గంలో ప్రతినిత్యం తిరుగుతూ అభివృద్ధి పనుల ప్రారంభం, పర్యవేక్షణ చేస్తూ వచ్చారు. తీరా శాసనసభకు వచ్చిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భేతి సుభాష్‌రెడ్డి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో అప్పటి వరకు ఉప్పల్ నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ ఒక్కసారిగా నెమ్మదించాయి. ప్రారంభించిన పనులపై పర్యవేక్షణ లేకపోగా, కొత్త పనుల అంశాన్ని పట్టించుకునే వారే లేకుండాపోయారు. మేయర్, ఎమ్మెల్యే ఎవరి దారిన వారే వెళుతుండటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
ఇవీ పనులు...
కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉప్పల్–వరంగల్ హైవే పనులు ప్రారంభించినా మరీ నెమ్మదిగా సాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం జీహెచ్‌ఎంసీ చేయాల్సిన భూ సేకరణ ఇంకా తొలిదశలోనే ఉండటం. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్లచెరువు వరకు 450 వాణిజ్య సముదాయాలను తొలగించాలని నిర్ణయించిన జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు కేవలం 18 మందికి మాత్రమే పరిహారం అందించారు. కొంత మందికి ఏడాది క్రితమే చెక్కులు సైతం సిద్ధం చేసినా పంపిణీ చేయకుండా ఫైళ్లను అటకెక్కించారు. దీంతో కాంట్రాక్టర్ పనులు చేస్తుండటం, భూసేకరణ చేయక షాపులను కూల్చకపోవటంతో ఉప్పల్–వరంగల్ హైవే దారి మరింత ఇరుకుగా మారిపోయింది. ప్రధాన రహదారి పనుల ప్రారంభానికి ముందే, ప్రత్యామ్నాయదారులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని జీహెచ్‌ఎంసీ యంత్రాంగం మరిచిపోయింది. దీంతో పాటు నల్లచెరువును సైతం మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చే పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. గతేడాదే పూర్తి కావాల్సి ఉన్నా.. మళ్లీ వర్షాకాలం వచ్చినా పనులింకా మిగిలే ఉన్నాయి. అదే విధంగా చర్లపల్లి ఫ్‌లైఓవర్ పనులు సంగతి అంతే. ఇక అన్నీ పూర్తి చేసుకున్న ఉప్పల్ శిల్పారామాన్ని ప్రారంభించేందుకు ముహూర్తమే కుదరటం లేదు. ఉప్పల్ పనులనగానే ‘ఆపేయండి లేదా..ఇప్పుడు వద్దు’ అంటూ వస్తున్న ఆదేశాలతో అధికారులు సైతం కిమ్మనటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment