సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వ్యూహాల అమలులో టీఆర్‌ఎస్ వేగం పెంచింది. ఫలితాలను ప్రభావం చేసే వర్గాల ఓట్లపై దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం అమలు చేసే పథకాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 16న పాక్షిక మేని ఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళిక అమలు చేస్తూనే ఈ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక అభివృద్ధి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీలకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లతో, ఎస్టీలకు రూ.6 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లతో పథకాలను అమలు చేస్తామన్నారు. పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ఈ పథకాలను వివరిస్తామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు ఎలా ఉం డాలనే దానిపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కడియం శ్రీహరి అధ్యక్షతన ఈ కమిటీ ఆయన నివాసంలో సోమవారం భేటీ అయింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎంపీలు బండ ప్రకాశ్, గోడం నగేశ్, పసునూరి దయాకర్, సీతారాం నాయక్, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పి.రాములు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ‘టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలి. తెలంగాణ జీవిత బీమా పేరిట ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జీవిత బీమా పథకం వర్తింపజేయాలి. గిరిజన గ్రామ పంచాయతీల సమగ్ర అభివద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువత ఉపాధికి బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందించేలా పథకం ఉండాలి’అని కమిటీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని మేనిఫెస్టో కమిటీకి ఈ నివేదిక సమర్పించనున్నారు. అనంతరం కేసీఆర్‌తో మరోసారి చర్చించి మేనిఫెస్టోలో చేర్చనున్నారు. కాగా, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనపై కేసీఆర్ నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించవచ్చనే అంశంపై కసరత్తు చేస్తున్నారు.
కమిటీకి వినతులు..
బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ వర్గాలకు రుణాలు మంజూరు చేయాలని, ఎస్సీలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కడియం శ్రీహరికి పలువురు టీఆర్‌ఎస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు బర్రెలు, గొర్రెలు పంపిణి చేయాలని.. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. పేద, మధ్యతరగతి వర్గాల వారికి స్వయం ఉపాధి కేంద్రాల ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందిచాలని, ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు జొరిక రమేశ్, వీర భిక్షపతి, చింతల యాదగిరి, బస్కె శ్రీలేఖ కృష్ణ, ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బండి రజిని తదితరులు కడియం శ్రీహరికి ఆదివారం వినతిపత్రం ఇచ్చారు. దళిత ఉపకులాల విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎస్సీ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీని కోరింది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతోనే రిజర్వేషన్ ఫలితాలు సమానంగా అందుతాయని పేర్కొంది.
రాహుల్ పర్యటన తర్వాత ప్రచారం..
కేసీఆర్ ప్రచార సభలపై టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార సభలు ఈ నెల 27న ఉన్నాయి. వీటి తర్వాతే కేసీఆర్ బహిరంగ సభలు జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 31న వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు కేసీఆర్‌ను కోరారు. దీనిపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించనున్నారు. నకిరేకల్ లేదా పాలకుర్తి నియోజకవర్గాల నుంచి ఈ సభలు ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రచారానికి సర్వం సిద్ధం..
టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి అవసరమైన వీడియోలు, పాటల రూపకల్పన పనులను కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. పలువురు రచయితలు, గాయకుల బృందంతో చర్చిస్తున్నారు. కొన్ని పాటలను ఆమోదించారు. మరికొన్ని పాటలకు మార్పులు సూచించారు. పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్రచారం కోసం రూపొందిస్తున్న ప్రకటనలను పరిశీలిస్తున్నారు.
ప్రచార సామగ్రి పంపిణీ..
టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రెండో విడత ప్రచార సామగ్రి పంపిణీ పూర్తయ్యింది. అభ్యర్థుల ప్రకటనలో ముందున్న టీఆర్‌ఎస్ వెంటనే మొదటి విడత ప్రచార సామగ్రిని పంపిణీ చేసింది. ఎక్కువ మంది అభ్యర్థులు దసరాలోపే మొదటి విడత ప్రచారం పూర్తి చేశారు. దసరా తర్వాత ప్రచార తీవ్రత పెంచాలని అభ్యర్థులకు సూచించిన నేపథ్యంలో ఆదివారం రెండో విడత ప్రచార సామగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యర్థి పార్టీలతో పోటీ ఉన్న నల్లగొండ, గద్వాల, జగిత్యాల వంటి నియోజకవర్గాల అభ్యర్థులకు అదనపు సామగ్రి ఇచ్చినట్లు తెలిసింది. కాగా, దళిత, బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు దళిత, బలహీన వర్గాల రిజర్వేషన్ పోరాట సమితి ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment